జగన్ కు మరో గిఫ్ట్ ప్యాక్ చేస్తున్న కేంద్రం… త్వరలో డెలివర్!

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావమో.. లేక, జగన్ వ్యూహాల ఫలితమో తెలియదు కానీ… గత కొన్ని రోజులుగా ఏపీ విషయంలో కేంద్రం సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నుంచి జగన్ కు కేంద్రం ఫుల్ వెల్యూ ఇస్తూ గౌరవిస్తూ… అడిగినవాటికన్నింటికీ కాస్త అటు ఇటుగా “ఓకే” అంటుంది. అందులో భాగంగా జగన్ కు హస్తినలో మరో గిఫ్ట్ ప్యాక్ అవుతుందని తెలుస్తుంది.

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మోడీ స‌ర్కార్ మ‌రోసారి ద‌న్నుగా నిలిచింది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12,911.15 కోట్లు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులిచ్చింది. కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రిమండలి ముందు తీర్మానం ప్రతిపాదించి.. ఆమోదం పొందాలని సూచించింది. ప్రస్తుతం ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు నిర్మించడానికి రూ.10,911.15 కోట్లకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, ప్రధాన డ్యాంలో పడ్డ అగాధాలు పూడ్చేందుకు అవసరమయ్యే నిధుల అంచనా కూడా కలిపి రూ.16,952.07 కోట్లు అవసరమని తేల్చి పోలవరం అథారిటీకి, కేంద్ర జల్‌ శక్తి శాఖకు సమర్పించారు.

అయితే తాజాగా ఆ రూ.10,911.15 కోట్ల రూపాయలకు… ప్రధాన డ్యాం ప్రాంతంలో ఏర్పడ్డ పెద్ద పెద్ద అగాధాల పూడ్చివేతకు అంచనా వేసిన రూ.2,000 కోట్లు కూడా కలిపి రూ.12,911.15 కోట్లకు కేంద్ర ఆర్థికశాఖ వ్యయ నియంత్రణ విభాగం ఆమోదించింది. త్వరలో ఈ మొత్తం సొమ్ము ఏపీ ప్రభుత్వానికి అందే ఛాన్స్ ఉంది!

కాగా… ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో రావాల్సిన రెవెన్యూ లోటు బ‌డ్జెట్ కు సంబంధించి రూ.10 వేల కోట్ల‌కు పైగా నిధులు రాష్ట్రానికి వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు దాదాపు 13 వేల కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు వచ్చింది!