ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఓ ఆశాజనకమైన మార్పు గమనించదగ్గంగా మారింది. ముఖ్యంగా పింఛన్లు రూ.4000కు పెరగడం, రోడ్లు మెరుగుపడడం వంటి అంశాలు ప్రజల్లో విశేష సంతృప్తిని కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న అభివృద్ధి తాలుకూ ధ్వనులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయని నిపుణుల అంచనా.
ఒకవైపు ఉద్యోగుల వర్గం నుంచి వచ్చిన స్పందన కూడా ఆసక్తికరం. గతంలో జీతాలు ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వారే, ఇప్పుడు నెల మొదటి తేదీకల్లా జీతాలు రావడాన్ని స్వాగతిస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న పాలన విధానాలపై విశ్వాసాన్ని పెంచే అంశంగా మారింది. ఉద్యోగ సంఘాల నుంచి కూడా ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతుగా స్వరాలు వినిపిస్తున్నాయి.
యువత పరంగా చూస్తే, డీఎస్సీ ప్రకటనకు అనుగుణంగా జరిగే నిబంధనలు, పెట్టుబడులకు దారితీసే అవకాశాల కల్పన.. వారిలో పాజిటివ్ వాతావరణాన్ని నెలకొల్పాయి. కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మెరుగవడం యువతను భవిష్యత్తుపై నమ్మకంగా చూసేలా చేస్తున్నాయి. ఇప్పుడు వారు రాజకీయాల కంటే తమ ప్రొఫెషనల్ లక్ష్యాలపైనే దృష్టి పెడుతున్నారు.
ఇంకా ఒక కీలక అంశం పింఛన్ల పెంపుతో పాటు సిమెంటు రోడ్ల నిర్మాణం. ఇప్పుడిక ఏ గ్రామానికెళ్లినా మెరుస్తున్న రోడ్లు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో పండుగలా పండుగ వాతావరణం కనిపిస్తోంది. రోడ్ల సౌకర్యం పెరగడం వల్ల సాధారణ ప్రజలకు ప్రయాణం సులభమవడమే కాకుండా, అభివృద్ధిపై నమ్మకం ఏర్పడుతోంది. ఈ మొత్తం పరిణామాల దృష్ట్యా ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ గతంలో ఆశించిన విధంగా ప్రధాన ఓటు బ్యాంకులను సతీష్టిపరచలేకపోయిన స్థితి ప్రస్తుతం కూటమికి తిరుగులేని బలం అవుతోంది. ఈ స్థాయిలో ప్రజల మద్దతు కొనసాగితే, జగన్ కు రానున్న రోజుల్లో కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.