జగన్ రెడ్డీ తలెక్కడ పెట్టుకుంటావ్.! బాబోరి మతిలేని ప్రశ్న.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ఏపీ నుంచి తెలంగాణలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సెటైర్ వేశారు. ‘జగన్ రెడ్డీ, మీ సొంత బాబాయ్ హత్య కేసు విచారణ నువ్వు పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యింది. నువ్విప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావ్.? ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి నువ్వు అర్హుడివి కావు.. వెంటనే రాజీనామా చెయ్..’ అంటూ చంద్రబాబు అల్టిమేటం జారీ చేసేశారు.

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది టీడీపీ అధినేత వ్యవహారం. మరీ ముఖ్యంగా ఈ కేసులో చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యం. నిజమే, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకింత సిగ్గుచేటైన వ్యవహారమే. కానీ, బాధిత కుటుంబం కోరిక మేరకు సర్వోన్నత న్యాయస్థానం ‘కేసు బదిలీకి’ ఒప్పుకుందన్న విషయాన్ని విస్మరించలేం.

ఇక, హత్య జరిగిందెప్పుడు.? 2019 ఎన్నికల సమయంలో. అంటే, అప్పటికి చంద్రబాబే ముఖ్యమంత్రి. చంద్రబాబు హయాంలో జరిగిన హత్య. తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, పైగా మాజీ ఎంపీ.. మాజీ మంత్రి.. మాజీ ఎమ్మెల్సీ హత్య జరిగితే.. దానికి నైతిక బాధ్యత వహించి చంద్రబాబు అప్పట్లోనే రాజీనామా చేసి వుండాల్సింది. అప్పట్లో చంద్రబాబు తన తల ఎక్కడా పెట్టుకోలేదు.! అలాంటి చంద్రబాబు ఇప్పుడు జగన్ రెడ్డీ నీ తల ఎక్కడ పెట్టకుంటావ్.? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ రాజకీయాలు ఇలాగే వుంటాయ్.. నిస్సిగ్గుగా వుంటాయ్.!