చక్రం తిప్పేసిన బాలయ్య.! పవన్ వికెట్ డౌన్.!

వైసీపీతో కాదు, టీడీపీతోనే ఎప్పటికైనా జనసేనకు ముప్పు.. అని జనసేనలోని మెజార్టీ కార్యకర్తలు భావిస్తారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇదే భావన వుంది. కానీ, తమ్ముడి పార్టీ.. తమ్ముడి ఇష్టం. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. అందుకే, ‘నాకెందుకీ గోల’ అని చేతులు దులుపుకుంటున్నారాయన.

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు.. అంటే, అది జనసేన భూస్థాపితానికే. ఈ విషయమై జనసేనలోనే చాలామందికి ఖచ్చితమైన అభిప్రాయం. కానీ, ‘పొత్తుల వ్యవహారాలు నాకొదిలెయ్యండి..’ అంటున్నారు పవన్ కళ్యాణ్. పొత్తుల చర్చలు ఇప్పుడెందుకు.? అంటూనే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు జనసేనానే స్వయంగా చేస్తున్నారాయె.

కాగా, నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ‘యువగళం’ పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేయనుండగా, ఈ యాత్ర ద్వారా నారా లోకేష్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారు.. తన అనుకూల మీడియా ద్వారా. లోకేష్ ఎక్కడా తాను ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పరు. చంద్రబాబు ఎలాగూ తానే ముఖ్యమంత్రినంటారు. టీడీపీ అనుకూల మీడియా ఏమో, జనసేనకు పది పదిహేను సీట్లను పొత్తులో భాగంగా చంద్రబాబు ముష్టి పడేయొచ్చన్నట్లుగా ప్రచారం చేయనుంది. ఈ మేరకు టీడీపీ అనుకూల మీడియాకి ‘కంటెంట్’ వెళ్ళిపోయింది.

విషయం ఎలా లీక్ అయ్యిందోగానీ, చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు వ్యవహారంపై జనసేన వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. దీన్ని కనీ వినీ ఎరుగని అవమానంగా భావిస్తున్నాయి. ఈ విషయమై జనసేన అధినేతతో, జనసేన పార్టీ నేతలు చర్చించే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఆయన మళ్ళీ హైద్రాబాద్ జంప్. తన సినిమా షూటింగుల్లో బిజీ అవుతారు. మళ్ళీ వీకెండ్ రాజకీయాలే.!