ఎవరీ మహాసేన రాజేష్.? రాష్ట్రంలో కొన్నాళ్ళ క్రితం మహాసేన రాజేష్ హాట్ టాపిక్. ఆయన్ని అరెస్టు చేశారంటూ పెద్ద యెత్తున రచ్చ జరిగింది. అంతకు ముందు ఆయన వైసీపీ మద్దతుదారుడు. ఆ తర్వాత ఆయన జనసేన వైపు వచ్చాడు. మహాసేన రాజేష్ ఓ యూ ట్యూబ్ చానల్ నిర్వాహకుడు. జనసేన పుణ్యమా అని బోల్డంత ఎలివేషన్ వచ్చిందాయనకి.
కానీ, జనసేన పార్టీని డంప్ చేసి ఆయన టీడీపీలో చేరిపోతున్నాడు. దాంతో ఒక్కసారిగా జనసేన పార్టీ షాక్‌కి గురయ్యింది. ‘ఎవరి రాజకీయ నిర్ణయాలు వారివి. మహాసేన రాజేష్ నిర్ణయాన్ని గౌరవిద్దాం. ఆయన మీద అనవసరమైన విమర్శలు చేయొద్దు..’ అంటూ స్వాయానా జనసేన కీలక నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
వాస్తవానికి మహాసేన రాజేష్, జనసేన పార్టీలో చేరలేదు. కానీ, పవన్ కళ్యాణ్ ఆయనకు గతంలో ఫోన్ చేసి మాట్లాడారు.. అరెస్టు వ్యవహారం సమయంలో. తాజాగా మాజీ మంత్రి బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది.
జనసేనలో చేరుతున్నట్లు సంకేతాలు పంపారు కూడా. జనసేనాని పవన్ కళ్యాణ్‌కి కాపులంతా అండగా వుండాలని కాపు నాయకుడైన కన్నా లక్ష్మినారాయణే వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీలో చేరాల్సిన కన్నా లక్ష్మినారాయణ చివరి నిమిషంలో బీజేపీ వైపు వెళ్ళారు. ఇప్పుడు జనసేనలోకి వెళుతున్నట్లు సంకేతాలిచ్చి టీడీపీలోకి వెళుతున్నారు. మహాసేన రాజేష్, కన్నా లక్ష్మినారాయణ.. ఈ ఇద్దరూ టీడీపీ వైపు తిరిగారంటే అది చంద్రబాబు మార్కు వెన్నుపోటు కాక మరేమిటి.?