సీబీఎన్ అరెస్ట్.! పవన్ కళ్యాణ్ ఇలా.. చిరంజీవి ఎలా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయి, జైలుకు వెళ్ళడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా బాధపడిపోతున్నారు. చంద్రబాబుని దత్త తండ్రిగా పవన్ కళ్యాణ్ భావిస్తుంటారన్నది వైసీపీ ఆరోపణ. ఆ ఆరోపణని తన చర్యల ద్వారా నిజం చేస్తుంటారు పవన్ కళ్యాణ్.

లేకపోతే, ‘ఆయన అరెస్టయితే మాకేంటి సంబంధం.? మేం, చట్టాన్ని గౌరవిస్తాం. రాజకీయంగా మా దారి మేం చూసుకుంటాం..’ అని చెప్పాల్సిన పవన్ కళ్యాణ్, ‘అరెస్టయినా చంద్రబాబుతోనే మా రాజకీయ ప్రయాణం’ అంటారేంటి.?

ఈ విషయమై మెగాభిమానుల్లో ఒకింత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయ వ్యూహాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సబబేనన్నది కొందరి వాదన. ఇంకొందరు మాత్రం, ‘ఇప్పటికైతే ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకప్పుడు చిరంజీవిని రాజకీయంగా దెబ్బ తీసిన చంద్రబాబు, ఈ రోజు జైలుకు వెళ్ళారు.. ఇది పండగ చేసుకోవాల్సిన సందర్భం..’ అని అంటున్నారు.

‘జెండా పీకేద్దామా..’ అన్న వార్త, టీడీపీ అను‘కుల’ మీడియాలో రావడానికి కారణం చంద్రబాబే. అంతే కాదు, చాలా సందర్భాల్లో చిరంజీవిని, టీడీపీ అను‘కుల’ మీడియా సాయంతో టార్గెట్ చేశారు.. చేస్తూనే వున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ, చంద్రబాబు, టీడీపీ అను‘కుల’ మీడియా కనికరం చూపలేదు.

మెగాభిమానుల్లో కొందరు మాత్రమే సంబరాలు చేసుకునే పరిస్థితి. ఆ మిగిలిన వర్గం, పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానులు. వాళ్ళకు సంబరాలు చేసుకునే అవకాశం లేదు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌కి పిలుపునిచ్చింది టీడీపీ. ఆ బంద్‌లో పాల్గొని, చంద్రబాబుకి సంఘీభావం తెలపాల్సి వస్తోంది కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు.

పవన్ పిలుపుని గౌరవిస్తాం. కానీ, రోడ్లెక్కి బంద్‌లో పాల్గొనబోం.. అన్నది మెజార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల వాదనగా కనిపిస్తోంది. ఇంతకీ, చంద్రబాబు అరెస్టుపై లోలోపల చిరంజీవి ఆనందిస్తారా.? అంటే, ఇలాంటివాటి గురించి ఆయన పట్టించుకోరు.!