చంద్రబాబు, వైఎస్ జగన్.. ఈ ఇద్దరూ బాధ్యత వహించాల్సిందే

చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్ సహా ఓ దివంగత రాజకీయ ప్రముఖుడి ఫొటోని కూడా కలిపి ఓ పోస్టర్ తయారు చేశారు కొందరు. ఆ పోస్టర్ కాపీల్ని గోడలకు అతికించారు. ఎక్కడ అతికించారన్నది తేలలేదుగానీ, ఆ పోస్టర్ తాలూకూ వీడియో అయితే, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

‘నా పెళ్ళాం పతివ్రత’ అనే సినిమా టైటిల్ పెట్టి, పోస్టర్లను విడుదల చేశారు. చంద్రబాబు కుటుంబం మీద ఎంతటి అసహ్యంతో, ఎంతటి వికారపు పైత్యంతో ఈ పోస్టర్ రూపొందించి వుంటారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఫొటోలతో కూడా ఇలాంటివే కొన్ని పోస్టర్లు తయారయినట్లు తెలుస్తోంది.

పోస్టర్లను తయారు చేయడం ఈ రోజుల్లో చాలా చాలా చిన్నపని. మొబైల్ ఫోన్లలో డిజైన్ చేసేసి, ఇంట్లో ప్రింటర్లతో విటిని తీసుకొచ్చేయొచ్చు. మూడో కంటికి తెలియకుండా పనైపోతుంది. కానీ, వీటిని గోడల మీద అతికిస్తున్నదెవరు.

అసలు ఇలాంటివాళ్ళని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నదెవరు.?
చంద్రబాబు అయినా, వైఎస్ జగన్ అయినా ఇలాంటివాటిని ప్రోత్సహిస్తారని అనుకోలేం. కానీ, వారి మెప్పు పొందేందుకు టీడీపీ, వైసీపీల్లోని కింది స్థాయి నేతెలెవరో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. మరి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది.? పోలీస్ వ్యవస్థ కంటే ముందు, ఆయా రాజకీయ పార్టీల్లో ఇలాంటివారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు.

‘చంద్రబాబు సతీమణిని తూలనాడితే, నా సతీమణిని తూలనాడతారు..’ అన్న ఆలోచన వైఎస్ జగన్‌కి వుండదా.? అలాగే చంద్రబాబు కూడా ఆలోచించరా.? ఆలోచిస్తారు, కానీ.. అధినేతలు అదుపు చేయలేని స్థాయికి కింది స్థాయి నేతలు విష వృక్షాల్లా ఎదిగిపోవడం వల్లనే ఈ దుస్థితి.
వున్నపళంగా ఈ జుగుప్సకు చంద్రబాబు, వైఎస్ జగన్ కలిసి తెరదించాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?