చెప్పులు.. టీడీపీ నేతలకీ చూపించొచ్చా చంద్రబాబుగారూ.?

పదే పదే రెడ్డి సామాజిక వర్గం మీద టీడీపీ నేతలు కొందరు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. ‘ఏయ్ జగన్ రెడ్డీ..’ అని మాట్లాడుతుంటుంటారు పట్టాభి తదితర టీడీపీ నేతలు. మరి, ఈ కుల దురహంకారాన్ని ఏమనాలి.? అన్న చర్చ తెరపైకొస్తోంది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాజా, ‘కులం పేరుతో విమర్శలు చేసేవారికి చెప్పు చూపించాలి..’ అంటూ వైసీపీ మీద మండిపడిపోయారు. ఇటీవల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కమ్మ సామాజిక వర్గంపై చేసిన దూషణల నేపథ్యంలో, కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకి ఒకింత పౌరుషం రావడం సహజమే. నిజమే, కులం పేరుతో ఎవరెలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేసినా జనం చెప్పులు చూపించే పరిస్థితి రావాలి.

ఏ రాజకీయ పార్టీకి అయినా ఇదే వర్తించాలి కూడా. టీడీపీ నేతలైనా, వైసీపీ నేతలైనా, ఇంకొకరైనా.. రాజకీయ నాయకులన్నాక, కులాలు అలాగే మతాలకు అతీతంగా వ్యవహరించాలి. దురదృష్టం, రాజకీయాల్లో అత్యంత నిస్సిగ్గుగా కుల, మత ప్రస్తావన తెస్తుంటారు రాజకీయ నాయకులు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఈ పైత్యం వుంది. కానీ, జనం ఏ రాజకీయ నాయకుడికీ చెప్పులు చూపించే పరిస్థితి లేదు.

అంతెందుకు, మంత్రి అంబటి రాంబాబు ఈ మధ్యనే ‘పిచ్చి కాపు’ అంటూ కాపు యువత మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో. రాజకీయాలు ఎంత అసహ్యంగా తయారయ్యాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే క్రమంలో రెడ్డి సామాజిక వర్గాన్ని కించపర్చడం, చంద్రబాబుని విమర్శించే క్రమంలో కమ్మ సామాజిక వర్గంపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం.. పవన్ కళ్యాణ్‌ని విమర్శించాలంటే, కాపు సామాజిక వర్గాన్ని చులకన చేయడం.. ఇదంతా సర్వసాధారణమైపోయింది.

ఈ రోగానికి మందు లేదు.! ఇది నయం చేయలేని రాజకీయ రోగం.!