టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు దొరకడం కష్టమేనా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం వుంది. చాన్నాళ్ళనుంచే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది.. ముందస్తు ఊహాగానాల ప్రచారంతో. ముందస్తుకి అవకాశమే లేదంటూ వైసీపీ పదే పదే చెబుతున్నా, విపక్షాలు మాత్రం ముందస్తు విషయమై ఆందోళన చెందుతున్నాయి.

ప్రధానంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నానా హైరానా పడుతోంది. ఎంత గింజుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకునే పరిస్థితి అయితే కనిపించడంలేదు. గెలవడం, ఓడిపోవడం సంగతి తర్వాత, ముందైతే అన్ని చోట్లా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు వున్నారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రస్తుతానికైతే పలువురు టీడీపీ ముఖ్య నేతలు తాము పోటీ చేయబోయే నియోజకవర్గాలపై కర్చీఫులు వేసేసుకుని కూర్చున్నారు. కానీ, ‘త్యాగాలు చేయక తప్పదు..’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంకేతాలు పంపుతున్నారు.. బీజేపీ, జనసేనతో పొత్తు కుదురుతుందన్న కోణంలో.

దాంతో, ఏయే నియోజకవర్గాల్ని టీడీపీ త్యాగం చేయాల్సి వస్తుందో అంచనాలేసుకుని, ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారట కొందరు టీడీపీ ముఖ్య నేతలు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఆయా నేతలు చేతులెత్తేశారనీ, టీడీపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదనీ తెలుస్తోంది.

రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగా వుంది. దాదాపుగా ఈ ప్రాంతాల్లో టీడీపీ నేతలు పూర్తిగా చేతులెత్తేశారట. ‘జనసేనకే వెళతాయో, బీజేపీకే వెళతాయో.. వాటి మీద ఆశ పెట్టుకోవడం అనవసరం. ఒకవేళ మనమే పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు..’ అని సీనియర్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట తెలుగుదేశం పార్టీలో.