వైసీపీకీ అభ్యర్థులు కష్టమేనట.! నిజమెంత.?

ఔను, రాజకీయాలు చాలా ఖరీదయిపోయాయి.! పది కోట్లు, పాతిక కోట్లనేది చిన్న మాటే!. ఎన్నికల్లో పోటీ చేయాలంటే, వంద కోట్లు.. ఆ పైన వెనకేసుకుని వుండాలి. లేకపోతే కష్టం.! ఇలా తయారయ్యింది పరిస్థితి.

‘ఓడినోడు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏడుస్తాడు.. గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు..’ అనే మాట రాజకీయాల్లో ఈ మధ్య రొటీన్‌గానే వింటూ వస్తున్నాం. ‘మాకు రెండు వేలు మూడు వేలు విదిలిస్తామంటే కుదరదు.. ఓటుకు ఆరు వేలు ఇవ్వాల్సిందే..’ అంటూ ఓటర్లు బాహాటంగా రోడ్డెక్కి రాజకీయ పార్టీల్ని నిలదీస్తున్న వైనం కనిపిస్తోంది.

ఫ్యామిలీ ప్యాక్ డీల్స్ కూడా మాట్లాడుతున్నారు.! ఇదీ పరిస్థితి. ఓటర్లు ఇలా డీల్స్ మాట్లాడుతోంటే, అభ్యర్థుల పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే, వంద కోట్లు.. అనేది కూడా చిన్న మాటేనేమో.. అంటారు కొందరు రాజకీయ నాయకులు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో వుంది టీడీపీ. అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో వైసీపీ వుంది. తమ ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో జనసేన వుంది. వెరసి, ఈసారి పోటీ మామూలుగా వుండదు.. అది డబ్బులు ఖర్చు పెట్టడంలో కూడా.!

అందుకే, విజయావకాశాల్ని అంచనా వేసుకుని.. ఆయా పార్టీల్లో టిక్కెట్ల రేసులో పాల్గొంటున్నారు నేతలు. అలాగే, పార్టీలూ డబ్బులు ఖర్చు చేయగల నేతల కోసం వెతుకుతోంది. అధికార పార్టీకి కూడా ఈ సమస్య వుందన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.! నిజమేనా.? నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా.!