అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ ఆపగలదా.?

అమరావతి రైతుల ఉద్యమం వేరు.. అమరావతిలో భూ కుంభకోణం వేరు.. ఈ క్రమంలో టీడీపీ మీద రాజకీయ ఆరోపణలు వేరు. మూడు రాజధానుల వ్యవహారమూ వేరు.! దురదృష్టమేంటంటే, వీటన్నిటినీ కలగాపులగం చేసేసి, నీఛ నికృష్ట రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.

అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరూ తప్పు పట్టరు. పాలనా వికేంద్రీకరణ అన్నది వేరే చర్చ. మూడు రాజధానులనేవి పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన వ్యవహారాలు. భూములిచ్చిన అమరావతి రైతులకు న్యాయం జరగాలన్నది ఇంకో కోణం. అమరావతిలో జరిగిన భూ కుంభకోణాన్ని బయటకు తీయడం మరో అంశం.

అధికారంలోకి వచ్చి మూడేళ్ళు దాటింది వైసీపీకి. అమరావతిలో భూ కుంభకోణమంటూ, రాష్ట్ర రాజధానిగా అమరావతి ఎంపికైనప్పటినుంచీ వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. అప్పటికీ ఇప్పటికీ అవే ఆరోపణలు. కేసులు నమోదు చేయడం మినహా, ఈ భూ కుంభకోణానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం వాస్తవాల్ని వెలికి తీయలేకపోతోంది.

29 గ్రామాల ఆరాటం.. టీడీపీ కుట్ర.. రైతుల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులు.. ఇదంతా అనవసరపు యాగీ.. అని వైసీపీకి ‘సలహా’ ఇచ్చేవాళ్ళే లేకుండా పోయారు. ఫలితం, మూడేళ్ళుగా రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియని పరిస్థితి.

ఈ హైడ్రామా వల్ల రాజకీయంగా తమకేదో కలిసొస్తుందని వైసీపీ అధినాయకత్వం అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అంతిమంగా, 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్న వచ్చి తీరుతుంది. దానికి వైసీపీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సమాధానం చెప్పాల్సి వుంటుంది.

మాకు ఐదు నిమిషాలు చాలు.. అమరావతి రైతుల పాదయాత్ర ఆపేయడానికి.. అని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేశారు పాదయాత్రని ఆపడానికి. కానీ, ఆపలేకపోయారు కదా.? ఇంకెందుకీ ప్రగల్భాలు.? ఎవరి మెప్పుకోసమీ అసందర్భ ప్రేలాపనలు.?