హైకోర్టు తమకు ఇన్నాళ్లు వ్యతిరేకంగా పనిచేసిందనేది వైఎస్ జగన్ బలమైన భావం. ఇతర వైసీపీ నేతలు కూడ ఆ పాటే పాడుతూ వచ్చారు. పంచాయతీ కార్యాలయాలకు రంగులు, మూడు రాజధానులు, ఇళ్ల పట్టాల పంపిణీ, డాక్టర్ సుధాకర్ కేసు, పాలనా పరమైన శాఖలను విశాఖకు తరలించడంపై స్టే, డాక్టర్ రమేష్ వివాదంలో ఆయన్ను విచారించకూడదనే ఉత్తర్వులు ఇలా పలు విషయాల్లో న్యాయస్థానం నుండి ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. పాలనను కూడ కోర్టులే నియంత్రిస్తే ఇక ప్రభుత్వం ఎందుకు, ప్రజలు ఎన్నుకున్న మేము ఎందుకు అంటూ వైసీపీ నేతలు బాహాటంగానే చెప్పారు. చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. జడ్జీలను, కోర్టు బెంచులను, ఏ బెంచ్ వద్దకు ఏ కేసు వెళ్లాలనే అంశాన్ని చంద్రబాబే డిసైడ్ చేస్తున్నారని, జస్టిసి ఎన్వీ రమణ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసున్నారని మండిపడ్డారు.
ఏకంగా ఆయన మీద సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే లేఖ రాశారు. ఈ వ్యవహారం దేశం మొత్తం సంచలనం రేపింది. అనేక మంది జగన్ చేసిన పనిని పొరపాటని అన్నారు. రాజకీయ విశ్లేషకులు, న్యాయనిపుణులు చాలామంది కోర్టులు రాజకీయ నాయకుల అదుపాజ్ఞల్లో ఉన్నాయని అనడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. వ్యతిరేక తీర్పులు వస్తే ఇలాంటిది అబాండాలు వేస్తారా అమీ మండిపడ్డారు. ఇక కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు అయితే న్యాయమూర్తుల మీద అవాకులు చవాకులు పేలి చివరకు నోటీసులు అందుకున్నారు. అయితే కోర్టుల విషయంలో ఈ అభిప్రాయం తప్పని రుజువుచేసే సంఘటనలు తాజాగా జరిగాయి.
ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను మీడియాకు బహిర్గతం చేసిన విషయంలో జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదని, ఆయన్ను పదవి నుండి తొలగించాలని అంటూ జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. మీడియాకు లేఖ విడుదలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరగా గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పిటిషనర్లను ప్రశ్నించారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడం ఏమిటని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంది.
ఇక తాజాగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీచేసిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని ఉత్తర్వులు ఇచ్చి పెద్ద సంచలనం రేపింది. కరోనా సమయంలో ఇలా ఎన్నికలు పెట్టడం సరైనది కాదనే ప్రభుత్వం వాదనను హైకోర్టు సమర్థించింది. కొన్ని నెలల పాటు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో హైకోర్టు ప్రభుత్వం వైపు నిలిచింది. దీంతో నిమ్మగడ్డ ఆటలన్నీ చిత్తయ్యాయి. ప్రభుత్వం ఆశించినట్టే స్థానిక ఎన్నికలు ఇప్పుడప్పుడే జరగవు. కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిక్షేపంగా జరుపుకోవచ్చు. ఈ తీర్పు వైసీపీకి, ఏపీ ప్రభుత్వానికి కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది. మరి ఈరోజు న్యాయం ప్రభుత్వం వైపు ఉంది కాబట్టే కోర్టు ప్రభుత్వాన్ని సమర్థించింది. గతంలో కూడ అంతే. న్యాయం ఉన్న వైపే తీర్పు చెప్పింది. అంతేకానీ పక్షపాతం చూపలేదు. మరి వైసీపీ నేతలు కోర్టులను తప్పుబట్టిన ఆ నోళ్లతోనే ఇప్పుడు పొగుడుతారేమో చూడాలి.