వీళ్ళు చెబితే ఓట్లేస్తారా ?

పొరుగు రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారా జనాలు ? ఇపుడిదే ప్రశ్న అందరిలోను మెదులుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావటమే లక్ష్యంతో చంద్రబాబునాయుడు అందుబాటులో ఉన్న పావులన్నింటినీ కదుపుతున్నారు. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ , ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ను పిలిపించుకున్నారు. అంతకుముందే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా ప్రచారం చేసి వెళ్ళారు.

ఇంతమంది పొరుగు రాష్ట్రాల వాళ్ళని చంద్రబాబు ప్రచారానానికి పిలిపించుకుంటున్నారంటే ఏమిటర్ధం ?  నిజంగానే  ఐదేళ్ళ పాలన వాళ్ళు చెప్పుకుంటున్నంత అద్భుతంగా చేసుంటే ఇపుడు బయట వాళొచ్చి చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? చంద్రబాబు అద్భుత పాలనంతా భూటకమే అనుకుంటే బయట నేతలొచ్చి చెప్పినంత మాత్రాన జనాలు చంద్రబాబుకు ఓట్లేసేస్తారా ?

ఐదేళ్ళ పాలనలో తానేం చేశారో చంద్రబాబు చెప్పుకోవటం లేదు. ఐదేళ్ళ పాలననే తిరిగా తాను కొనసాగిస్తానని కూడా చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నారు సిఎం. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. ఇక ప్రస్తుత పాలన ఎలా సాగిందో అందరూ చూస్తున్నదే. కాబట్టి ఇదే విధమైన పాలనను కొనసాగిస్తానని చెప్పుకోలేకపోతున్నారు.

చంద్రబాబు పరిపాలన గురించి పొరుగు రాష్ట్రాలకు చెందిన పై నేతలకు ఏమాత్రం తెలిసినా బహుశా ప్రచారానికి వచ్చేవారు కాదేమో ?  మొత్తానికి వారికి కూడా ఏదో తాయిలాలను ఆశచూపి ప్రచారానికి తెచ్చుకున్నంత మాత్రానా వాళ్ళు చెప్పింది వినేసి జనాలు ఓట్లేసేస్తారని అనుకుంటే అంతకుమించి అమాయకత్వం మరోటుండదు.