అవును ఇదే మాట జనసేన వర్గాల నుండే వినబడుతోంది ఇపుడు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేనకు రాష్ట్రలో ఏమేరకు ఓటు బ్యాంకుందో ఎవరికీ తెలీదు. ఆమాటకొస్తే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కూడా తెలీదనుకోండి అది వేరే సంగతి. పార్టీ తరపున పోటీ చేస్తున్న 136 మందిలో ఎంతమంది గెలుస్తారనే విషయంలో పార్టీ నేతలకే స్పష్టత లేదు. అలాంటి సమయంలో పవన్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం నిజంగా సాహసమే.
ఎవరికైనా ఒక నియోజకవర్గంలో గెలవటమే అంతంత మాత్రంగా ఉంటుంది. అలాంటిది రెండు నియోజకవర్గాల్లో గెలుపంటే మాటలు కాదు. చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేకేనా ఒక నియోజకవర్గంతో సరిపెట్టుకుంటున్నది ? రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటమంటే చాలా రిస్కుతో కూడిన వ్యవహారం.
మరి పవన్ ఏమాలోచించుకుని రెండింటిలో పోటీ చేస్తున్నారో ఆయనకే తెలియాలి. సరే ప్రస్తుత విషయానికి వస్తే పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాకలో ఎక్కడ కూడా జనసేన బలంగా ఉందని చెప్పేందుకు లేదు. చూడబోతే టిడిపి సహకారం మీదే ఆశలు పెట్టుకుని పవన్ రెండింటిలో పోటీ చేస్తున్నట్లుంది. పవన్ గెలుపుకు భీమవరంలో రాజులు, బిసిలు అడ్డం తిరుగుతున్నారట. అంటే కాపులు ఫుల్లుగా సపోర్టున్నారని కాదులేండి. ఇక్కడ పవన్ గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇక గాజువాకలో టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాసరావు గట్టి అభ్యర్ధే. ఓడించటం అంత ఈజీకాదు. అదే సమయంలో వైసిపి అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి కూడా తక్కువ వాడేమీ కాదు. అంటే ఇక్కడ పవన్ గెలుపు అంత తేలికకాదు. మరి పవన్ ఓడిపోతే ? ఛాన్సే లేదంటున్నారు జనసైనికులు. ఎందుకంటే, టిడిపినే తమ అధినేతను గెలిపిస్తుందనే విశ్వాసంతో ఉన్నారట. అంటే టిడిపి క్యాండిడేట్ పల్లాను చంద్రబాబు బలిపశువును చేస్తున్నట్లేనా ? ఏమో ? చూద్దాం పోలింగ్ రోజున ఏం జరుగుతుందో ?