ప్రత్యేకహోదా సాధించే సత్తా ఎవరిలో ఉంది ?

ఇప్పుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. చంద్రబాబునాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇదే పాట పాడుతున్నారు చాలా కాలంగా. నిజానికి ఏ పార్టీకి 25 ఎంపి సీట్లనూ జనాలు ఇచ్చినా ఏమీ చేయలేరన్నది వాస్తవం. ఎక్కడ బహిరంగసభ జరిగినా చంద్రబాబు చెప్పేదొకటే 25 ఎంపి సీట్లలోను తెలుగుదేశంపార్టీనే గెలిపిస్తే ప్రత్యేకహోదా సాధిస్తామని చెబుతున్నారు. అదే విధంగా జగన్ మాట్లాడుతూ 25కి 25 ఎంపి సీట్లలో వైసిపినే గెలిపిస్తే కేంద్రప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామని చెబుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇద్దరు జనాలను మోసం చేస్తున్నట్లే లెక్క.

 

ఏపికి ప్రత్యేకహోదా విషయంలో  దేశంలోని ఏ ఒక్క పార్టీ కూడా మద్దతుగా నిలబడలేదు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి, టిడిపిలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా కొన్ని పార్టీల ఎంపిలు సంతకాలు పెట్టిన మాట వాస్తవమే. అయితే,  ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలనే విషయం మీద కన్నా నరేంద్రమోడిపై వ్యతిరేకతతోనే సంతకాలు పెట్టారన్న విషయం గుర్తుంచుకోవాలి.  రేపటి రోజున ఏపికి ప్రత్యేకహోదా వచ్చే అవకాశాలున్నాయి అని తేలితే అప్పుడు ఏ పార్టీ నిజస్వరూపమేంటో తెలుస్తుంది.

 

ఇక చంద్రబాబు విషయం చూస్తే నాలుగేళ్ళు ఎన్డీఏతో కలిసున్నంత కాలం ప్రత్యేకహాదా కావాలని అడిగిన పాపాన పోలేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచటం లాంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాకులాడారు తప్ప ప్రత్యేకహోదా, రైల్వేజోన్ లాంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏరోజూ డిమాండ్ చేయలేదు. వ్యక్తిగత ప్రయోజనాలు సాధ్యం కాదని అనుకున్న తర్వాతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసి హోదా కోసం పోరాటమంటూ కొత్త నాటకాలాడుతున్నారు. గట్టిగా చెప్పాలంటే జగన్ మాత్రమే హోదా కోసం నాలుగేళ్ళుగా పోరాటం చేస్తున్నారన్నది వాస్తవం. హోదా డిమాండ్ తో వైసిపి ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేసిన విషయం అందరూ చూసిందే.

 

ఇక 25 ఎంపిల విషయం చూస్తే, టిడిపి, వైసిపిల్లో ఏ పార్టీకి 25 ఎంపి సీట్లను ఇచ్చినా ఏపికి ప్రత్యేకహోదా రాదన్నది వాస్తవం. ఏపికి ప్రత్యేకహోదా ఎప్పుడు వస్తుందంటే, కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా ఏపిలోని ఎంపిల మద్దతుతోనే సాధ్యమనే పరిస్ధితి తలెత్తితేనే హోదా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా జగన్ అయితేనే హోదా డిమాండ్ సాధిచే అవకాశం ఉంది. మళ్ళీ చంద్రబాబైతే అనుమానమే. ఎందుకంటే, కేంద్రం తన చెప్పు చేతుల్లో ఉందని అనుకున్నపుడు వ్యక్తిగత ప్రయోజనాలే గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర పార్టీలు అడ్డుపడినా, ఏపి ఎంపిల అవసరం రాకపోయినా ఏపికి హోదా వచ్చే అవకాశాలైతే కనబడటం లేదు. ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలున్నాయా ?