లేఖను ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతారా ? ఎవరిది డ్రామానో తేలిపోతుంది

వైసిపి నేతల ప్రకారం విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది…

చంద్రబాబునాయుడు చెబుతున్నదాని ప్రకారం జగన్ పై దాడి అంతా డ్రామానే….

 

సరే ఎవరు చెప్పేది నిజమో ? అబద్ధమో ? ఇప్పటిలో తేలేది కాదు. కానీ జగన్ పై దాడి వాస్తవం. ఎడమ భుజానికి గాయమవ్వటం నిజం. విశాఖపట్నం విమానాశ్రయంలోనే ప్రధమ చికిత్స తర్వాత హైదరాబాద్ లో శస్త్ర చికిత్స కూడా వాస్తవమే అనటంలో సందేహం లేదు. హత్యాయత్నానికి, దాడి డ్రామాకు మధ్య ఏం  జరిగింది ? అసలు దాడి చేసిన శ్రీనివాస్ జగన్ పై ఎందుకు కత్తితో దాడి  చేశారో తెలియాలంటే అందుకు ఫోరెన్సిక్ పరీక్ష ఒక్కటే మార్గమనిపిస్తోంది.

జగన్ పై దాడిని చంద్రబాబు డ్రామాగా కొట్టిపారేయటం వెనుక రెండు కారాణాలున్నాయి. కాసాపు చంద్రబాబు చెప్పిందే నిజమనుకుందాం. హత్యాయత్నానికి వచ్చే వారెవరు జేబులో 11 పేజీల ఉత్తరాన్ని పెట్టుకుని తిరగరు. ఆత్మహత్య చేసుకునే వారు జేబులో లేఖలు పెట్టుకోవటం చూశామే కానీ హత్యాయత్నానికి ప్రయత్నించేవారి జేబులో కూడా లేఖలుండటం ఇదే మొదటి ఘటన. నిందుతుని జేబులో దొరికిన లేఖల ప్రకారం అతను జగన్ అభిమానట. అందుకనే మొన్నటి జనవరిలో కూడా జగన్ తో కలిసి పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని చంద్రబాబు చెబుతున్నారు. నిందితుని ఇంటిలో కూడా వైఎస్ ఫొటోలున్నాయట. అందుకనే శ్రీనివాస్ దాడిని చంద్రబాబు డ్రామాగా కొట్టేస్తున్నారు.

అదే సమయంలో శ్రీనివాస్ జేబులో దొరికిన లేఖను తెలుగుదేశంపార్టీ నేతలు సృష్టించారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ఫొటోతో పెట్టిన  ఫ్లెక్సీ  మార్ఫింగ్ చేసినదంటూ వైసిపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. సరే, ఎవరి వాదనలు ఎలాగున్నా దాడి ఘటనపై వాస్తవాలేంటో తెలియాల్సుంది. అందుకు చంద్రబాబు సిద్దమా ? నిందుతుని వద్ద దొరికిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే విషయం తేలిపోతుంది కదా ?

శ్రీనివాస్ చేతిరాత, లేఖలోని దస్తూరీని పోల్చిచూస్తే తేలిపోతుంది. అదే విధంగా ఫ్లెక్సీని కూడా ఫోరెన్పిక్ పరీక్షలకు పంపితే అది నిజమైన ఫ్లెక్సీనేనా ? లేకపోతే మార్ఫింగ్ చేసిందా ? అన్నది కూడా తేలిపోతుంది. మరి అందుకు చంద్రబాబు సిద్దమేనా ? తనపైన తానే దాడి చేయించుకుని జగన్ హత్యాయత్నం డ్రామాలాగుతున్నారన్న విషయం తేల్చాలన్నా చంద్రబాబు ఫోరెన్సిక్ పరీక్షలు చేయించాల్సిందే.