ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ సమాధానం చెప్పగలరా.?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఏంటి.? అనే నైరాశ్యం ప్రజల్లో నెలకొనడానికి కారణం.. పాలకులే. చాలాకాలంగా పార్లమెంటు సమావేశాలన్నా, శాసన సభ సమావేశాలన్నా ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లిపోతోంది. చట్ట సభల సాక్షిగా ప్రజా సమస్యలపై చర్చ జరగడంలేదు. ఆ స్థానంలో రాజకీయ విమర్శలకే చట్ట సభలు వేదికలవుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కఠిన ప్రశ్నలు అడగండి.. కానీ, సమాధానం చెప్పనివ్వండంటూ విపక్షాలకు చురకలంటించారు మోడీ. బాగానే వుంది.

నిజానికి, అధికార పక్షానికి ఎక్కువ సమయం వుంటుంది. విపక్షాలకు దొరికే సమయం చాలా తక్కువు. విపక్షాల్ని కూడా అధికార పక్షం మాట్లాడనివ్వాలి. ఎదురుదాడి తప్ప, ప్రజా సమస్యలపై పద్ధతిగా సమాధానం చెప్పడం ఎప్పుడో మర్చిపోయింది అధికార పక్షం. మిగతా విషయాల సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా సంగతేంటి.? తల్లిని చంపేసి, బిడ్డకు జన్మనిచ్చినట్లు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విడదీసి, తెలంగాణ ఏర్పాటు చేశారు.. 13 జిల్లాల సీమాంధ్రకు అన్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ.. గతంలో వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించేటప్పటికి ఆయన ప్రధాని అభ్యర్థి మాత్రమే. మరి, అలాంటి వ్యక్తి ప్రధాని అయ్యాక, అన్యాయాన్ని సరిదిద్దాలి కదా.? ఏడేళ్ళయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎందుకు లేదు.? ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిసారీ తప్పించుకుంటోంది మోడీ సర్కార్. పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోడీనే ఆరోపించారు. మరి, ఏటీఎం ద్వారా డ్రా చేసిన నిధుల్ని తిరిగి తెప్పించగలిగారా.? కఠిన ప్రశ్నలు కావు, సాధారణ ప్రశ్నలే ఇవి. సమాధానం మోడీ చెప్పగలరా.? ఛాన్సే లేదు.