మొత్తానికి లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తాజాగా మంగళగిరి పేరు వినబడుతోంది. రాజధాని జిల్లాలోని మంగళగిరిలోని రాజధాని అమరావతి ప్రాంతముంది. ఈ నియోజకవర్గంలో పట్టుకోసం చంద్రబాబునాయుడు ఎంత ప్రయత్నించినా పట్టుదొరకటం లేదు. కారణం వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటమే.
ఆళ్ల దెబ్బకు చంద్రబాబుకు చాలాసార్లే దిమ్మతిరిగింది. ఓటుకునోటు కేసు, సదావర్తి భూముల వేలంపాటను నిలిపేయటం, రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోకుండా కోర్టుల్లో స్టేలు తీసుకురావటంలో ఆళ్ళదే ప్రముఖ పాత్ర. చంద్రబాబు పై న్యాయపోరాటాలు చేసి విజయం సాధించటం ద్వారా ఆళ్ళ రాష్ట్రవ్యాప్తంగా పాపురలయ్యారు. అదే సమయంలో రైతుల నుండి కాయగూరలు, ఆకుకూరలు కొని నియోజకవర్గంలో చవకగా పంపిణీ చేస్తున్నారు.
అంతేకాకుండా రాజన్న క్యాంటిన్ పేరుతో మంగళగిరి పట్టణంలో 4 రూపాయలకే పేదలకు భోజనం పెడుతున్నారు. రోజుకు సుమారు 500 మంది భోజనాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తు, మరోవైపు సొంత డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేయటం ద్వారా జనాల్లో ఆళ్ళ బాగా పాతుకుపోయారు. ఇటువంటి ఆళ్ళపై లోకేష్ పోటీ చేయాలని అనుకోవటమంటే పెద్ద సాహసం క్రిందే లెక్క. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆళ్ళపై గెలవచ్చని లోకేష్ అనుకుంటున్నట్లున్నారు. మరి జనాలు ఏం చేస్తారో చూడాల్సిందే.