‘కర్నూలు అసెంబ్లీ నుండి మంత్రి నారా లోకేష్ పోటీ చేయాలి’…ఇది తాజాగా కర్నూలు ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన. కర్నూలులో పోటీ చేయాలని లోకేష్ ను ఎస్వీ ఆహ్వానించటం బాగానే ఉంది. కానీ లోకేష్ అంత ధైర్యం చేస్తారా అన్నదే సందేహం. తండ్రి సిఎం ఉండగా కొడుకు ప్రత్యక్ష ఎన్నికలను కాదని దొడ్డిదోవన ఎంఎల్సీ పదవి తీసుకుని మంత్రైన ఘటన దేశం మొత్తం మీద ఏపిలో మాత్రమే జరిగినట్లుంది. అటువంటి లోకేష్ రేపటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారా అని పార్టీలోనే చర్చ జరుగుతోంది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని లోకేష్ ప్రకటించగానే తమ నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ చాలామంది ఎంఎల్ఏలే ఆఫర్ చేశారు. తమ నియోజకవర్గంలో లోకేష్ పోటీ చేయటానికి వీలుగా తక్షణమే రాజీనామాలు కూడా చేస్తామన్నారు. అయినా ఎంఎల్ఏగా పోటీ చేయటానికి లోకేష్ సాహసం చేయలేదు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు లోకేష్ గతంలోనే ప్రకటించారు కానీ ఎక్కడి నుండి పోటీ చేస్తారు ? అన్న విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు.
ఏదో సేఫ్ నియోజకవర్గాన్ని చూసుకుని పోటీ చేయాలన్నది లోకేష్ ఆలోచన. ఎక్కడబడితే అక్కడ పోటీ చేస్తే మాడు పగులుతుందన్న విషయం లోకేష్ కు కూడా బాగా తెలుసు. నిజంగానే పోటీ చేయాల్సొస్తే ఏ హిందుపురమో లేకపోతే తండ్రి నియోజకవర్గం కుప్పం నుండే పోటీ చేస్తారు. అంతేకానీ అడిగారు కదా అని పలమనేరో, పెనమలూరో, గుడివాడ, కర్నూలు నుండి పోటీ చేయటానికి లోకేష్ కేమన్నా పిచ్చా ?
తన నియోజకవర్గాన్ని త్యాగం చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి పోటీదారులను దూరంగా పెట్టి మళ్ళీ టికెట్ తీసుకోవాలన్నది ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ ఎత్తుగడ అని తెలిసిపోతోంది. అందుకనే టికెట్ కోసం పోటీ పడుతున్న రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కొడుకు టిజి భరత్ లాంటి వాళ్ళు ముందుజాగ్రత్త పడకుంటా ఉంటారా ? గతంలో ఫిరాయింపు ఎంపి బుట్టారేణుక, ఎస్వీలకు లోకేష్ టికెట్లు ప్రకటించారు. ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుకకు చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. ఇక ఎస్వీ టికెట్ ఏమవుతుందో చూడాలి.