ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెదకూరపాడులో రోడ్డు షో చేసిన ఆయన… బుధవారం సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బాబు ముందు పెద్ద ప్రశ్న ఉంది. దానికి చంద్రబాబు ఇచ్చే ఒక్క పరిష్కారంతో… రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కేడర్ కు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకబోతున్నాయి.
తెరపైకి ఐదుముక్కలాట..:
అవును… నిన్నమొన్నటివరకూ సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ కోసం మూడు ముక్కలాట జరుగుతుందని వార్తలొచ్చాయి. అయితే తాజాగా అక్కడ ఐదుముక్కలాట తెరపైకి వచ్చింది. చంద్రబాబు తాజా టూర్ లో ఐదు వర్గాలుగా విడిపోయిన టీడీపీ కేడర్… ఎవరి నినాదాలు వారు చేసుకుంటూ, ఎవరి ఫ్లెక్సీలు వారు పెట్టుకుని తిరుగుతున్నారు. బాబు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు.
కోడెల కొడుకు రిక్వస్ట్:
సత్తెనపల్లి అసెంబ్లీ సీటు తనకే ఇవ్వాలని, గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచీ పార్టీ కోసం కష్టపడ్డానని, నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్లూ జెండా తానే నిలబెట్టానని కోడెల శివప్రసాదరావు కొడుకు.. కోడెల శివరామకృష్ణ గట్టిగా చెబుతున్నారు. తన తండ్రి పార్టీకి ఎన్నో సేవలు చేశారని, ఈసారి తనకు టిక్కెట్ ఇవ్వనిపక్షంలో ఇక కోడేల రాజకీయాలకు చంద్రబాబు సమాధి కట్టినవారవుతారని చెబుతున్నారు.
మిగిలిన ఆ నలుగురు:
ఆ సంగతి అలా ఉంటే… రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు కూడా గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి వీరాంజనేయులు, యువనేత అబ్బూరి మురళి కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరి ప్రయత్నాలు ఒకవైపు సాగుతుండగానే.. బీజేపీ నుంచి టీడీపీలో చేరినప్పుడే సత్తెనపల్లి టికెట్ హామీ తీసుకుని కన్నా లక్ష్మీనారాయణ ఎంటరయ్యారు!! దీంతో… సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐదు ముక్కలాట తెరపైకి వచ్చింది.
ఎవరికి కాదు.. ఎందుకనేది కీలకం:
అయితే… ఇక్కడ ఎవరికి సీటిస్తారనేది పెద్ద విషయం కాదు. ఎందుకు సీటిచ్చారనేది కీలకంగా మారబోతుందని అంటున్నారు విశ్లేషకులు. అవును… ఇక్కడ నుంచి కనా లక్ష్మీనారాయణకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తే… “ఇన్ని రోజులూ పార్టీ కోసం పనిచేసినవారికే టిక్కెట్టు” అని చంద్రబాబు తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ కు విలువలేకుండా పోతుంది. తాను మారానని చెప్పుకుంటున్న చంద్రబాబు… ఏమీ మారలేదని, అవే దగా రాజకీయాలు చేస్తున్నారని కేడర్ భావించే ప్రమాధం ఉంది! అలా అని రాయపాటి సాంబశివరావుకి ఇచ్చినా కూడా దాదాపు ఇలాంటి ఇబ్బందులే తలెత్తే పరిస్థితి!
కోడెల ఫ్యామిలీకి భరోసా:
కోడెల శివప్రసాద్ కుటుంబానికి ఈసారి బాబు కచ్చితంగా సీటివ్వాలని కోరుతున్నారు తమ్ముళ్లు. దానికి రెండు కారణాలు వారు చెబుతున్నారు. “బ్రతికున్నంతకాలం పార్టీలోనే ఉంటూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసి, పార్టీకి తోడున్న కోడెల కుటుంబానికి, ఆయన మరణానంతరం పార్టీ తోడుందనే సంకేతం” క్యాడర్ తో పాటు ప్రజలకూ ఇచ్చినట్లుంటుంది.
ఇదే క్రమంలో… కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం చేయరని సంకేతాలిచ్చినట్లవుతుంది.
అలా కానిపక్షంలో…:
“యువకులకే పెద్దపీట, కష్టపడినవారికే సీట్లు” అనేవి బాబు చెప్పే పనికిరాని కబుర్లు, మోసపూరిత మాటలే తప్ప… వాస్తవాలు కాదని, చంద్రబాబు మారలేదని, ప్రజలతోపాటు క్యాడర్ ను, నేతలను కూడా మోసం చేస్తున్నారని ఒప్పుకున్నట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. సో… సత్తెనపల్లి విషయంలో చంద్రబాబు తీసుకునే ఒక నిర్ణయం…. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం క్యాడర్ లో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లవుతుందని అంటున్నారు!