బిజెపి పాలన అంతం చంద్రబాబు వల్లవుతుందా ?

చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటే ఏదో భ్రమల్లో ఉన్నట్లే ఉన్నారు. తాను భ్రమల్లో ఉంటూ జనాలను కూడా భ్రమల్లో ముంచేందుకు ప్రయత్నిస్తుండటంతోనే సమస్యలు వస్తున్నాయ్. తాజాగా ఆయన మాటలు వింటుంటే అందరిలోను అవే అనుమానాలు వస్తున్నాయి. బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉమ్మడి పోరాటం చేస్తారట. దేశంలో బిజెపి పాలన అంతం చేయటమే తన లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. నిజానికి బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో యూపిఏ ఎలాగూ కొన్ని పార్టీలు ఎప్పటినుండో పనిచేస్తున్నాయి. కాబట్టి కొత్తగా బిజెపికి వ్యతిరేకంగా పార్టీలను చంద్రబాబు కలిపేదేమీ లేదు.

ఎన్డీఏ, యూపియే కూటములతో సంబంధం లేకుండా త్రుణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బిఎస్పీ బీజూ జనతాదళ్, టిఆర్ఎస్ లాంటి పార్టీలున్నాయి. వాటిని యూపియే కూటమిలోకి తేవటంలో చంద్రబాబు విఫలమైనట్లే లెక్క. తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాకపోతే ఇఫుడున్నంత మెజారిటీ రాకపోవచ్చు. మెజారిటీ తగ్గుతుందన్నంత మాత్రానా ఎన్డీఏ కూటమి ఓడిపోతుందని కాదు కదా ?

నిజానికి ఎన్డీఏ బలహీనంగా ఉన్నా ప్రత్యర్ధి కూటమి యూపిఏ ఏమంత బలంగా లేదన్నది వాస్తవం. కాబట్టి మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని జాతీయ మీడియా సంస్ధల సర్వేలు సూచిస్తున్నాయి. వాస్తవాలిలా ఉంటే చంద్రబాబేమో ఉత్తరకుమారుని ప్రగల్బాలన్నీ పలుకుతున్నారు. దేశంలో బిజెపి పాలన అంతం చేయటం సంగతి తర్వాత ముందు టిడిపిని ఎలా గెలిపించుకోవాలో ఆలోచించుకుంటే బాగుంటుంది.