అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు అవినీతి పాలనపై విచారణ చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనలో రూ 6.17 లక్షల కోట్ల సంపదను చంద్రబాబు అండ్ కో దోపిడి చేసినట్లు జగన్ ఆరోపించారు. చంద్రబాబు దోపిడికి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయి కాబట్టి వాటన్నింటినీ దర్యాప్తు సంస్ధలకు అప్పగించి విచారణ చేయిస్తామని జగన్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు అండ్ కో తనపై చేసిన ఆరోపణలను కేవలం ఎల్లో మీడియా చేస్తున్న గోబెల్స్ ప్రచారంగా కొట్టేసిన జగన్ ముఖ్యమంత్రి అవినీతికి మాత్రం పూర్తి ఆధారాలున్నాయని చెప్పటం గమనార్హం.
సరే ఒక ప్రభుత్వంలో జరిగిన అవినీతి తర్వాత ప్రభుత్వంలో విచారణ చేయించటం, నిరూపితం కావటం, కోర్టు ద్వారా శిక్షించటం అన్నది దేశ రాజకీయ చరిత్రలోనే దాదాపు జరిగిన దాఖాల్లాలేవు. కాకపోతే పదవిలో ఉండగానే వచ్చిన ఆరోపణలపై సిబిఐ వంటి సంస్ధలు కేసులు నమోదు చేసి విచారణ చేసినపుడు మాత్రం తర్వాత ప్రభుత్వాల్లో శిక్షలు పడిన ఘటనలున్నాయి. తమిళనాడులో జయలలిత, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, కర్నాటకలో యడ్యూరప్ప, ఉత్తర ప్రదేశ్ లో మాయావతి లాంటి వారి అవినీతి నిరూపితమై శిక్షలు పడిన ఘటనలున్నాయి. అయితే ఆ కేసులన్నీ వారు సిఎంలుగా ఉన్నపుడే వారిపై నమోదైన విషయం గుర్తుంచు కోవాలి.
కానీ ఏపిలో మాత్రం అటువంటి చరిత్ర లేదు. ఏదో తూతూమంత్రంగా చంద్రబాబు అవినీతిపై గతంలో వైఎస్ ముఖ్యమంత్రి ఉండగా మాజీ మంత్రి రోశయ్య నేతృత్వంలో కమిటీలు వేశారంతే. అయితే, అప్పటికే చంద్రబాబు పైన కూడా ఏలేశ్వరలం లాంటి చాలా కేసులే నమోదై, కమీషన్లు విచారణ కూడా జరిపిన ఘటనలున్నాయి. కానీ అవేవీ నేరుగా చంద్రబాబును తప్పుపడుతూ శిక్షలను సిఫారసు చేయలేదు. పైగా ఆ కమీషన్ల విచారణపై చంద్రబాబు కోర్టుకెళ్ళి విచారణ తెచ్చుకున్నదే ఎక్కువ. చంద్రబాబుపై చాలా కేసులే కోర్టులో విచారణ జరగకుండా కోల్డు స్టోరేజీలు మూలన పడున్న విషయం అందరికీ తెలిసిందే. న్యాయవ్యవస్ధ గనుక నిష్పక్షపాతంగా విచారణ జరిపుంటే చంద్రబాబు విషయం ఏమయ్యుండేదో ?
ఎప్పటివో కేసులదాకా ఎందుకు ? అందరికీ తెలిసిన, నాలుగేళ్ళ క్రితమే బయటపడిన ఓటుకునోటు కేసు ఏమైంది ? అందులో పాత్రదారులను పోలీసులు అరెస్టు చేశారో కానీ సూత్రదారులను కనీసం టచ్ కూడా చేయలేకపోయారు. కేసులో అసలు సూత్రదారి చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ కోర్టులో స్టే కారణంగా ఏ వ్యవస్ధ కూడా చంద్రబాబును ఏమీ చేయలేకపోతోంది. అన్నీ వ్యవస్ధలను చంద్రబాబు ఆ స్ధాయిలో మ్యానేజ్ చేసుకుంటున్నారు. ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అవినీతిపై జగన్ కేసులు పెట్టేదెప్పుడు ? విచారణ జరిగేదెప్పుడు ? కోర్టు ద్వారా శిక్షలు పడేదెప్పుడు ? వ్యవస్ధలు రక్షణ కవచంగా నిలబడినంత కాలం చంద్రబాబును ఎవరు ఏమీ చేయలేరంతే.