వైసీపీలో వర్గ విబేధాలు కర్నూలు జిల్లానూ తాకాయి. ఇక్కడ యువ నేతలకు, ఎమ్మెల్యేలకు సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఒకరి మీద ఒకరు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. అందరి ముందూ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గం వైకాపాలో యువ నేత అయిన బైరెడ్డి సిద్దార్థరెడ్డికి, ఎమ్మెల్యే ఆర్థర్ కు వ్యవహారం చెడిందట. ఏ నియోజకవర్గంలోనూ లేని సాంప్రదాయం ఈ నియోజకవర్గంలో ఉంది. మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నవారే ఇంఛార్జులుగా ఉంటారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఆర్థర్ అయితే ఇంఛార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి. ప్రజలిచ్చిన పదవిలో ఉన్నవారు ఒకవైపు, జగన్ కట్టబెట్టిన బాధ్యతలో ఉన్నవారు ఇంకోవైపు ఉండటంతో మెల్లగా ఆధిపత్య పోరు మొదలైంది.
జగన్ అండ మెండుగా ఉండటంతో మొదటి నుండి నందికొట్కూరులో సిద్దార్థరెడ్డి హవానే నడిచేది. పేరుకే ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉండేవారు. పార్టీ పనులతో పాటు ప్రభుత్వ కార్యాలు కూడ సిద్దార్థరెడ్డే చూసుకునేవారు. కొన్ని నెలలపాటు ఈ పద్దతిని ఓర్చుకున్న ఆర్థర్ మెల్లగా తిరగబడ్డారు. సిద్దార్థరెడ్డి నుండి పగ్గాలు లాక్కోవాలని ట్రై చేస్తున్నారు. ఈ సంగతిని మోటులోనే గమనించిన సిద్దార్థరెడ్డి జగన్ వద్ద నుండి క్లారిటీ తీసుకుని మళ్ళీ పుంజుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఆర్థర్ మాత్రం జగన్ వరకూ వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే రాజకీయం స్టార్ట్ చేశారట. జిల్లా నేతల సహకారంతో సిద్దార్థరెడ్డికి చెక్ పెట్టేస్తున్నారు. ఇంతకుముందులా అన్నింటికీ సిద్దార్థరెడ్డే ఉండాలంటే కుదరదని, ఎమ్మెల్యేని తాను ఉన్నానని చాటుతున్నారట.
చిన్న వయసులోనే ఎదిగిపోతూ జిల్లా స్థాయికి చేరుకుంటున్న సిద్దార్థ రెడ్డికి చెక్ పెట్టాలని కొందరు జిల్లా లీడర్లు గట్టిగా భావించారు. అందుకే ఆర్థర్ కు పూర్తి సహకారం అందించారట. దగ్గరుండి మరీ పార్టీ వర్గాలను, అధికారులను ఆర్థర్ వైపుకు తిప్పుతున్నారట. దీంతో సిద్దార్థరెడ్డి నొచ్చుకున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలైతే తానే చూసుకునేవారు కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నది జిల్లా స్థాయి నేతలు. అందులోనూ ఒక మంత్రి ప్రముఖంగా ఉన్నారట. దీంతో చర్చలు చేస్తే సమస్య పరిష్కారం కాదని భావించిన సిద్దార్థరెడ్డి యుద్ధానికే దిగేశారు. తన వర్గాన్ని సపరేట్ చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారట. ఇటీవల జగన్ ప్రజాసంకల్పయాత్ర ముగిసి మూడేళ్లు గడిచిన సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో సిద్దార్థరెడ్డి అతికష్టాం మీద అనుమతులు తెచ్చుకుని ఒంటరిగా సభలు, ర్యాలీలు పెట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. ఆర్థర్ కూడ తన వర్గంతో గట్టిగానే హడావిడి చేశారు.
ఈ సభల్లో సిద్దార్థరెడ్డి కొందరు నాయకులు శిఖండి రాజకీయం చేస్తున్నారని, పెద్ద నాయకులం అనుకునే వాళ్లు వారి పద్ధతి మార్చుకోవాలని, నందికొట్కూరులో వేలు పెట్టి రాక్షసానందం పొందుతామంటే ఊరుకునేది లేదని, నియోజకవర్గంలో పనికిమాలిన రాజకీయాలు చెల్లవని ఓపెన్ వార్నింగ్ ఇచ్చేశారు. అంతేకాదు యువతకు ప్రాధాన్యం ఇవ్వరా, పార్టీలో ఉండాలా వద్దా అంటూ ఫైర్ అయ్యారు. నిజానికి ఈ వ్యవహారం జగన్ వరకూ వెళ్లాలనే సిద్దార్థరెడ్డి ఓపెన్ అయ్యారు. ఆయన అనుకున్నట్టే రాష్ట్ర పెద్దలకు ఈ వివాదం తెలిసిందని, త్వరలోనే జగన్ వరకూ వెళ్ళిపోతుందని అంటున్నారు. మరి తమ్ముడు లాంటి సిద్దార్థరెడ్డి కష్టాల్లో ఉన్నారని తెలిస్తే జగన్ ఎలా రియాక్ట్ అవుతారో మరి.