కొత్తరకం బ్లాక్ మెయిల్?… అమ్మవారికి పూజలు – బాబుకు ఆప్షన్లు!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ సమయంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ప్రధానంగా పొత్తులో భాగంగా టీడీపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా పలు కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉన్న టీడీపీ నేతలు బాబు దృష్టిని ఆకర్షించేందుకు ఎవరిస్థాయిలో వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బుద్దా వెంకన్న విషయం ఆసక్తికరంగా గా మారింది.

అవును… టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఈ వారంలోనే తమ అభ్యర్దుల జాబితా ప్రకటనకు సిద్దమయిన నేపథ్యంలో… ఈ విషయంపై చంద్రబాబు – పవన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా… విజయవాడలో రెండు పార్టీలు ఆశిస్తున్న ఒక సీటు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇందులో భాగంగా… విజయవాడ వెస్ట్ సీటు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా పోతిన మహేష్ ఆ సీటును ఆశిస్తున్నారు. విజయవాడలో జనసేనకు ఒక సీటు ఇస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో పోతిన మనేష్ కు పవన్ మాట ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబుకు ఇచ్చిన లిస్ట్ లో కూడా పోతిన మహేష్ పేరు ప్రధానంగా ప్రస్థావించినట్లు చెబుతున్నారు.

అయితే… ఇప్పుడు టీడీపీకి చెందిన విజయవాడ పశ్చిమ నేతలు తమకు ఆ సీటు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా… మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీటు ఆశిస్తూ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో… తనకు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ లేదా అనకాపల్లి పార్లమెంటు సీటు కేటాయించాలని కోరుతున్నారు.

ఆ విధంగా బాబుకి ఆప్షన్స్ ఇచ్చిన వెంకన్న… విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా.. తన ఇంటి నుండి కనకదుర్గమ్మ గుడి వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు టిక్కెట్ వచ్చేలా చూస్తే మొక్కుబడులు చెల్లించుకుంటానంటూ అమ్మవారిని వేడుకున్నారు.

దీంతో… భక్తి సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తొలి నుంచి పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ… తనకు పైన పేర్కొన్న రెండు స్థానాల్లో ఎక్కడో ఒక చోట సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇన్నీ చెప్పిన వెంకన్న ఆఖరులో.. సీట్ల కేటాయింపులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయమని సన్నాయి నొక్కులు కూడా నొక్కారని తెలుస్తుంది. ఈ సందర్భంగా… టిక్కెట్ల విషయంలో ఎవరైనా చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేస్తే తాట తీస్తానంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.