ఏపీ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాకిచ్చారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవ ఎన్నికలపై అనుమానం వ్యక్తం చేశారు.. సమగ్ర నివేదిక ఇవ్వాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని.. ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రకటించొద్దని ఆదేశించారు.
మిగిలిన 11 జిల్లాలలో ఏకగ్రీవాలు సాధారణంగానే ఉన్నాయన్నారు. మొదటి విడత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించొద్దని ఎస్ఈసీ చెబుతోంది.. మొదటి దశ ఎన్నికల్లో ఎక్కువ ఏకగ్రీవాలు చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఉండటంతో ట్విస్ట్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే .. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కాగా.. సర్పంచ్ పదవుల కోసం 19,491, వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 1,323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 18,168 మాత్రం సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. తొలి విడతలో విజయనగరం జిల్లా లేదు. మిగిలిన 12 జిల్లాలను పరిశీలిస్తే.. తొలి విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీలు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 454 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 163 పంచాయతీలున్నాయి