మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల సమావేశానికి వెళ్లక పోవడం ప్రతిపక్ష వైసీపీ చేసిన వ్యూహాత్మక రాజకీయ తప్పిద మయింది. ఒక సమావేశానికి హాజరు కావడం , కాకపోవడం ఆయా పార్టీల స్వేచ్ఛ. కానీ ఎన్నికల సమయంలో జరుగుతున్న అందులోనూ తెలుగుదేశం , బీజేపీలకు వ్యతిరేక ముద్ర ఉన్న ఉండవల్లి నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లకూడదనుకోవడం ద్వారా ప్రజలకు పొరపాటు సంకేతం పంపినవారు అవుతారు.
తెలుగుదేశం భాగస్వామ్యం ఉన్న ఏవేదికలోను తాము భాగస్వామి కామని వైసిపి అనడంలో తప్పులేదు. జరుగుతున్న సమావేశం ఉద్దేశ్యం 2019 ఎన్నికల తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలి అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. నిజానికి ఈ చర్చను వైసిపి సమాజంలో బలంగా తీసుకుని వెళ్ళాలి. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి సాయం తీసుకోవాలి అంటే గడిచిన ప్రభుత్వంలాగా ఉంకూడదు అన్న చర్చ రావాలి. బీజేపీతో కలసి నాలుగు సంవత్సరాలు కలిసి వారు అన్యాయం చేసినపుడు గట్టిగా బలపరిచి వారితో విడిపోగానే పోరాటం చేసే రాజకీయాలు రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని దానికి కారణం అయిన తెలుగుదేశం పార్టీని అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోముద్దాయిగా నిలబెట్టాల్సిన బాధ్యత , అవసరం వైసీపీది. నేడు సమావేశం నిర్వహిస్తున్నది అధికారపక్షం కాదు అలానే వారికి అనుకూల వ్యక్తి అంతకన్నా కాదు. పైపెచ్చు వైసీపీకి అనుకూలం అని ముద్ర ఉన్న ఉండవల్లి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదనుకోవడం అర్థం లేదు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం 2019 ఎన్నికలను పూర్తిగా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య పొరటంగా మార్చాలి అని నిర్ణయం తీసుకుంది. నిజానికి 2019 ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే కాదు రాష్ట్ర అసంబ్లీ ఎన్నికలు కూడా. విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం పాత్ర , అమలు కోసం తెలుగుదేశం చేసిన కృషితోబాటు విడిపోయి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన ఎన్నికలు కూడా. కానీ అలాంటి వాతావరణం రాష్ట్రంలో ఉండకూడదన్న వైఖరితో ఉన్నది తెలుగుదేశం. దీనికి కొందరు మేధావులు మరి కొన్ని రాజకీయ పార్టీలు తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉండవల్లి సమావేశానికి హాజరు కావడం ద్వారా వాస్థవాల ప్రాతిపదికన 2019 ఎన్నికలు జరిగి , గత తప్పిదాలు జరగని రాజకీయ వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నపుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుందని బలంగా వైసిపి వినిపించాలి. మేధావులు కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పాలితప్ప భావోద్వేగాలతో కూడిన రాజకీయ సమీకరణాలుకు సహకరించ కూడదు అన్న చర్చను తీసుకు రావాలి. అలాంటి అరుదైన ఉండవల్లి సమావేశానికి హాజరు కాకపోవడం ద్వారా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక పోవడమే కాకుండా రాజకీయాలలో ఒంటరి కావడం ఖచ్చితంగా వ్యూహాత్మక తప్పిదమే.
-మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి