పిచ్చ కామెడి: హోదా కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలట

కామెడి కాకపోతే మరేంటట. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్షం సమావేశానికి నిజంగా ప్రతిపక్షాలేవీ హాజరుకాలేదు. హాజరైన వారిలో మంత్రులు, టిడిపి ఎంపిలు, చంద్రబాబు భజన బృందాలు, టిడిపి నేతలు, ఉద్యోగ జెఏసి, మాజీ నేత అశోక్ బాబు తప్పించి మరొకరు లేనే లేరు. ఇంతమాత్రానికి అఖిలపక్షమంటూ చంద్రబాబు భలే బిల్డప్ ఇస్తున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు  ప్రధాన ప్రతిపక్షం వైసిపి, బిజెపి, జనసేన, వామపక్షాలు చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా నిరాకరించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇంత మాత్రానికే హాజరైన అఖిలపక్షంతోనే కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోలన నిర్వహిస్తారట. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 13వరకూ వివిధ రూపాల్లో రాష్ట్రంలో నిరసనలు తెలుపుతారట. 11న ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తారట. 12 అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రాష్ట్రపతి దగ్గరకు వెళతారట. సరే అఖిలపక్షం అంటూ నిర్వహించిన సమావేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు తీవ్రమైన కాంమెంట్లే చేశారులేండి. అఖిలపక్షం నిర్వహించే ఆందోళనలకు జనాలు మద్దతు తెలపాలట. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకహోదాపై జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న జనాలపై ఇదే చంద్రబాబు కేసులు పెట్టించిన విషయం ఎవరైనా మరచిపోతారా ?

జనాలు అడగని, తాము చేయని తప్పుకు రాష్ట్ర విభజన చేసి ఎందుకు శిక్ష విధిస్తున్నారంటూ చంద్రబాబు అమాయకంగా కేంద్రంపై మండిపోయారు. రాష్ట్ర విభజనకు మద్దతుగా తాను రెండు లేఖలను ఇచ్చిన విషయం జనాలు మరచిపోయారని చంద్రబాబు అనుకుంటున్నారు. తెలంగాణాలో పర్యటించినపుడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మొదటి ఓటు వేసింది తామ ఎంపినే అంటూ వరంగల్, మహబూబ్ నగర్ జిల్లా పర్యటనల్లో బహిరంగంగా చెప్పిన విషయం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

మొత్తానికి ఎంతో ఆర్భాటంగా జరిగిన అఖిలపక్ష సమావేశంతో చంద్రబాబు పరువే పోయింది. ఎందుకంటే, ఒక్కరోజు ముందుగా మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవే అంశాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టిడిపి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్, వామపక్షాలు హాజరైన విషయం అందరూ చూసిందే. అంటే ఉండవల్లికున్న క్రెడిబులిటీ కూడా చంద్రబాబుకు లేదని అర్ధమైపోయింది.