చంద్రబాబుకన్నా ఉండవల్లికే క్రెడిబులిటీ ఎక్కువుంది

చూడబోతే చంద్రబాబునాయుడుకన్నా మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కే క్రెడిబులిటీ ఉందని తేలిపోయింది. విషయం ఏదైనా, ఎక్కడైనా సరే చంద్రబాబుకు ఉండవల్లి వైఖరికి చాలా తేడా ఉంది. ప్రత్యేకహోదా, రాష్ట్ర ప్రయోజనాలు తదితరాలపై చంద్రబాబు ఈరోజు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేది లేదంటూ వైసిపి, జనసేన, బిజెపి, వామపక్షాలు స్పష్టంగా తేల్చి చెప్పాయి. విచిత్రమేమిటంటే తెలంగాణాలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు సమావేశానికి హాజరు కావటం లేదు. సరే రౌండ్ టేబుల్ సమావేశానికి గైర్హాజరవ్వటానికి ప్రతీ పార్టీ కూడా దేనికదే కారణాలను కూడా బహిరంగంగానే స్పష్టం చేశాయి.

అంటే చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశానికి బహుశా మళ్ళీ టిడిపి ప్రజా ప్రతినిధులు తప్ప ఇంకెవరూ హాజరయ్యేట్లు లేదు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మంగళవారం ఉండవల్లి కూడా ఇదే అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి టిడిపి, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. వైసిపి, సిపిఎం మాత్రం హాజరుకాలేదు. అంటే ఇక్కడే చంద్రబాబుకు, ఉండవల్లికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనబడుతోంది. ఉండవల్లికున్న క్రెడిబులిటీ కూడా చంద్రబాబుకు లేదని తేలిపోయింది.

నాలుగున్నరేళ్ళ పాలనలో హుద్ హుద్ తుపాను, ప్రత్యేకహోదా, కరువు లాంటి అనేక అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని జగన్మోహన్ రెడ్డితో సహా అనేక పార్టీలు ఎన్నోసార్లు డిమాండ్ చేశాయి. ఏ విషయంలో కూడా అఖిలపక్ష సమావేశం అవసరమే లేదని చంద్రబాబు తేల్చి చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

హోదా విషయంలో అయితే, అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రధానమంత్రి తీసుకెళ్ళమని ప్రతిపక్షాలు ఎన్ని సార్లు డిమాండ్ చేసినా ఉపయోగం లేకపోయింది.  డెలిగేషన్ కు చంద్రబాబునే నేతృత్వం వహించమని కూడా జగన్ స్పష్టంగా చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా హోదా అని డిమాండ్ చేసిన వారిని జైళ్ళల్లో పడేయించారు. అందుకే ఎన్నికల ముందు చంద్రబాబు మొదలుపెట్టిన డ్రామాల్లో తాము పాత్రదారులం కామంటూ ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా మొహం మీదే చెప్పేశాయి.