ప్రత్యేకహోదా, విభజన హామీలను సాధించడానికి బుధవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం సాయంత్రం తమకు సమాచారం ఇచ్చి, బుధవారం ఉదయాన్నే సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. తమకు తగిన సమయం ఇవ్వకుండా, సమావేశం పూర్తిస్థాయి అజెండాను నిర్ణయించకుండా మొక్కుబడిగా దీన్ని నిర్వహించారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం సంఘటితంగా పోరాడటానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. ఆ పోరాటంలో చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే జనసేన చేతులు కలుపుతుందని ఆయన పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మొక్కుబడి సమావేశాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోవని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. బలమైన పోరాటంతోనే హోదా సిద్ధిస్తుందని, అటువంటి పోరాటానికి మాత్రమే తాము చేతులు కలుపుతామని అన్నారు. ఇకపై ఇలాంటి మొక్కుబడి సమావేశాలకు తమను ఆహ్వానించవద్దని తేల్చి చెప్పారు.