బొత్సకు ఎదురుగాలి.! ఈసారి లెక్క తప్పేలా వుందే.!

ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ శక్తి.. అనే మాట బొత్స సత్యనారాయణకి అతికినట్టు సరిపోతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఆ సెగల్లో ఒకింత డీలా పడింది బొత్స కుటుంబం. ‘విడిపోతే నష్టమేంటి.?’ అని బొత్స వ్యాఖ్యానించడంతో, అప్పట్లో బొత్స మీద సమైక్యవాదులు యుద్ధమే ప్రకటించారు.

అయితే, వైసీపీలోకి వచ్చాక, బొత్స సత్యనారాయణ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అన్న చందాన, తన అనుచరగణంలో కొత్త ఉత్సాహం నింపగలిగారు. బొత్స సత్యనారాయణ అంటే, ఆయనొక్కరే కాదు, ఆయనది ఓ బలమైన రాజకీయ కుటుంబం.

బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ గతంలో ఎంపీగా పనిచేశారు. బొత్స కుటుంబంలో పలువరు రాజకీయాల్లో వున్నారు, చట్ట సభలకూ ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు.

గత కొంతకాలంగా రాజకీయంగా ఒకింత సైలంటయిన బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, ఈసారి యాక్టివ్ అవుతున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగే అవకాశం వుందట. వైఎస్ జగన్ ఆదేశిస్తే పోటీకి సిద్ధమంటూ బొత్స ఝాన్సీ ప్రకటించేశారు కూడా.

మరోపక్క, బొత్స కుటుంబంలో పలువురు, ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళుతున్నారు. జనసేన వైపు వారంతా చూస్తున్నారన్న ప్రచారం ఉత్తరాంధ్రలో జరుగుతోంది. బొత్స కూడా, జనసేనతో టచ్‌లోకి వెళ్ళారంటూ కొద్ది రోజుల క్రితమే ఊహాగానాలు వినిపించాయి.

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డినీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ నానా రకాలుగా తూలనాడారు బొత్స సత్యనారాయణ. జనసేన మీదనో, టీడీపీ మీదనో ప్రస్తుతం విమర్శలు చేస్తున్నారాయన. ముందు ముందు, పార్టీ మారాల్సి వస్తే.. ఏమీ ఎరగనట్టే వుంటుంది వ్యవహారం.

కాగా, బొత్సకి ఎదురుగాలి గట్టిగానే వుందనీ, ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని ఎంటర్టైన్ చేయడం వల్ల ఉపయోగం లేదని వైసీపీ అధినాయకత్వానికి పలు నివేదికలు అందినట్లు తెలుస్తోంది.