నిరుద్యోగులకు జగన్ మరో వరం

నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి మరో వరం ప్రకటించారు. తొందరలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జగన్ మాట్లాడుతూ పై ప్రకటన చేశారు. చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నంత కాలం ఏపిపిఎస్సీకి ఏమాత్రం పని బడలేదు. అదే జగన్  సిఎం అయ్యిందగ్గర నుండి ఏపిపిఎస్సీకి చేతినిండా పని మొదలైంది.

నిజానికి ప్రభుత్వ శాఖల్లో సంవత్సరాల తరబడి లక్షలాది ఉద్యోగాలు భర్తీ కాకుండా చంద్రబాబు ఆపేశారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయన్న విషయం ఎప్పటికప్పుడు వివరాలు తీసుకోవటంతోనే చంద్రబాబు ఐదేళ్ళు కాలం గడిపేశారు. నిరుద్యోగ జేఏసి ఖాళీల భర్తీ విషయమై ఎన్ని ఆందోళనలు చేసినా ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. ఒకవైపు ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకోకపోగా రిటైర్మెంట్ వయస్సును కూడా రెండేళ్ళు పెంచటంతో నిరుద్యోగులు బాగా ఇబ్బందులు పడ్డారు.

సమస్యలన్నీ తెలిసినా చంద్రబాబు ఏనాడూ ఖాళీల భర్తీకి ప్రయత్నం చేయలేదు. అదే మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ సిఎం కాగానే ఉన్న ఖాళీలపై లెక్కలు తీశారు. ముందుగా అత్యవసరం అనుకున్న వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇచ్చారు. వాలంటీర్ల నియామకాలు జరిగిపోయాయి. గ్రామసచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

జగన్ తాజా ప్రకటనతో వివిధ శాఖల్లో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేయటానికి తొందరలో నోటిఫికేషన్లు రెడీ చేస్తోంది ఏపిపిఎస్సీ. విచిత్రమేమిటంటే ఖాళీలను భర్తీ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే టిడిపి నేతలేమో ఉద్యోగాలు కల్పించటంలో జగన్ ఫెయిల్ అయినట్లు ఆరోపణలు చేస్తున్నారు. అంతర్గతంగా మాత్రం ఖాళీల భర్తీకి జగన్ తీసుకుంటున్న చర్యలతో మండిపోతున్నారు.