కొంతమంది నాయకులు తెలిసో తెలియకో చేసే వ్యాఖ్యలు మొదటికే మోసాన్ని తెస్తాయని అంటుంటారు. వారి ప్రత్యేకమైన జ్ఞానంతో కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంటారు. ఇందులో భాగంగా తాజాగా మార్గదర్శి మోసాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న రామోజీ రావుని వెనకేసుకొచ్చే క్రమంలో టీడీపీ నేత బోండా ఉమ అడ్డంగా ఇరికించేశారని అంటున్నారు పరిశీలకులు.
అవును… మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావును వెనకేసుకు రావటానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా… దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ గ్రహీత రామోజీరావుపై ప్రభుత్వం కేసులు నమోదు చేయటం ఏమిటంటూ మండిపడ్డారు. రామోజీపై ఏడు కేసులు పెట్టిన ప్రభుత్వం చివరకు ఏం సాధించిందని ఎద్దేవా చేశారు.
అనంతరం పాడిందే పాడరా పాసిపల్ల దాసన్న అన్న చందంగా… ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకుండానే మార్గదర్శిలో అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయని ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని బోండా ఆరోపించారు. ఇప్పటికే ఫిర్యాదులు చేసిన వారితో పోలీసులు బోండా పక్కనే ప్రెస్ మీట్ పెట్టిన సంగతి మరిచిపోయారు! దీంతో పద్మ విభూషణ్ పేరు చెప్పి రామోజికి కొత్త సమస్యలు తెచ్చారని అంటున్నారు పరిశీలకులు.
పద్మ పురస్కార గ్రహీతలు తప్పులు చేసినా, మోసాలకు పాల్పడినా ప్రభుత్వాలు కేసులు పెట్టకూడదా? విచారణ జరపకూడదా? పద్మ పురస్కారాలన్నది మోసాలు చేయటానికి, అవినీతి చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సు కాదు కదా? అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో పద్మ పురస్కార గ్రహీతలను నేరారోపణలపై అరెస్టులు చేసిన ఉదాహరణలను తెరపైకి తెస్తోన్నారు.
ఈ సమయంలో పద్మ పురస్కార గ్రహీతలపై నేరాలు నిరూపణ అయితే ప్రభుత్వం పురస్కారాలను వెనక్కు తీసుకుంటుంది కూడా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… అసలు 2016లో రామోజీకి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించేనాటికే ఆయనపై చీటింగు కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తులకు, కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తులకు పద్మ పురస్కారాలు ఇవ్వకూడదు.
మార్గదర్శి చీటింగ్ కేసు 2006 నుండే కోర్టుల్లో నలుగుతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో రామోజీ మోసాలకు పాల్పడ్డారని సీఐడీ బల్లగుద్ది చెబుతోంది. ఈ కేసులో మొదటి నుండి ఫైట్ చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రామోజీ మోసాలకు పాల్పడినట్లు అన్నీ ఆధారాలున్నాయంటున్నారు. ఇవికాకుండా గతంలోనే మరో రెండు వేర్వేరు కేసుల్లో రామోజీ కోర్టు మెట్లెక్కారు. ఆ కేసుల్లో కోర్టు తీర్పు రామోజీకి వ్యతిరేకంగానే వచ్చింది.
అయితే చిత్రంగా ఇన్నేసి కేసులు, మోసాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్న ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి ప్రభుత్వం అసలు పద్మ పురస్కారం ఇవ్వనే కూడదని వాదించేవాళ్ళు కూడా ఉన్నారు. రామోజీకి పద్మవిభూషణ్ ఇవ్వటంపై ఎవరైనా కోర్టులో కేసు వేస్తే అదో కొత్త తలనొప్పి వ్యవహారం అవుతుంది. మరి ఇన్ని లొసుగులు కిందపెట్టుకుని బోండా ఉమ తనదైన ప్రత్యేక జ్ఞానంతో ఇలా మాట్లాడటంపై పెదవి విరుస్తున్నారు విశ్లేషకులు.
ఈ సమయంలో ఎవరైన రామోజీరావుకి పద్మ పురష్కారం ఇచ్చే సమయానికే ఆయనపై కేసులు ఉన్నాయని పిటిషన్ దాఖలు చేస్తే… అదో సమస్య. మార్గదర్శి కేసులో చీటింగ్ నిజమని కోర్టు తీరుపు ఇచ్చి రామోజీకి శిక్ష వేస్తే… అప్పుడు కూడా పద్మ వెనక్కి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఈ విషయాలు తెలియకో.. లేక, జనాలకు తెలియదు అనుకునో… పద్మ విభూషణ్ గ్రహీత రామోజీరావుపై ప్రభుత్వం కేసులు నమోదు చేయటం ఏమిటంటూ అర్ధంలేనిప్రశ్నలు అడుగుతున్నారు బోండా ఉమ!