బెజవాడలో టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమకు ఊహించని షాక్

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకి ఇంద్రకీలాద్రి కనకదుర్గ గుడిలో ఊహించని షాక్ తగిలింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో టీటీడీ బోర్డు మెంబర్, స్థానిక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమకు అవమానం జరిగింది. ఆయన రాకముందే తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెంట్ ఈఓ సాయి అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించారు. దీంతో మనస్థాపం చెందిన ఉమా అక్కడి నుండి అలిగి వెళ్లిపోయారు. దీనిపై పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.

నవరాత్రుల్లో ఏడవ రోజు సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గా దేవి ఈరోజు అనగా మంగళవారం 16 -10 2018 న మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి గత రాత్రి నుండే భక్తులు ఆలయం వద్ద తండోపతండాలుగా వేచి ఉన్నారు. తెల్లవారుఝాము నుండే వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

కాగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొనడానికి స్థానిక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ గుడికి వెళ్లారు. నవరాత్రుల్లో టీటీడీ వారే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అయితే కనకదుర్గ గుడికి తాను వెళ్లనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమాచారం అందించారు బోండా ఉమా.

అయినప్పటికీ ఆయన రాకకంటే ముందే టీటీడీ అసిస్టెంట్ ఈఓ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దీంతో అమ్మవారి పట్టువస్త్రాల సమర్పణ విషయంలో టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నా ఆయనను పట్టించుకోలేదని అవమానంగా ఫీల్ అయిన బోండా ఉమా అక్కడి నుండి అలిగి వెళ్లిపోయారు. దుర్గగుడి అధికారుల తీరును తప్పుబట్టారు ఆలయ పాలకమండలి సభ్యులు ధర్మారావు. దీనిపై స్పందించారు దుర్గగుడి ఈఓ కోటేశ్వరమ్మ.

ఈఓ కోటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన ఆదేశాల మేరకే అసిస్టెంట్ ఈఓ పట్టు వస్త్రాలు సమర్పించారు అని తెలిపారు. సారె తీసుకువచ్చిన వారిని గౌరవంగా తీసుకెళ్లడం మా బాధ్యత కాబట్టి అలానే చేసాము అని తెలియజేసారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెంట్ ఈఓ మాట్లాడుతూ మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకున్నాను. బోండా ఉమా వస్తారని మాకు సమాచారం అందించారని తెలపడం గమనార్హం.