భారతీయ జనతా పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీ-టీమ్‌లా పని చేస్తోందా.? ‘అబ్బే, అలాంటిదేం లేదు..’ అని తరచూ ఇటు బీజేపీ, అటు వైసీపీ చెబుతూ వస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో మౌనం దాల్చడం దగ్గర్నుంచి, చాలా విషయాల్లో కేంద్రం మెడలు వంచలేక వైసీపీ చతికిలపడటానికి కారణం ఆ ఫెవికాల్ బంధమేనన్న ఆరోపణలు అయితే అలాగే వున్నాయ్.
తాజాగా, బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్ మాట్లాడుతూ, ‘వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అవడమంటే, బీజేపీ – వైసీపీ మధ్య సంబంధం లేనట్టే..’ అంటూ సెలవిచ్చారు. ఇదేం ప్రస్తావన.? బీజేపీ లాజిక్కులు అలాగే తగలబడతాయి.
సీబీఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ మీద రాజకీయ ఒత్తిళ్ళు వుండవన్నది ఇప్పుడున్న రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. సీబీఐ ఏనాడో రాజకీయ పంజరంలో చిలక.. అన్న విమర్శలున్నాయి. సరే, అలాంటి విమర్శలు సబబా.? కాదా.? అన్నది వేరే చర్చ.
‘మేం కలిసి వుంటే, భాస్కర్ రెడ్డి అరెస్టయ్యేవారు కాదు..’ అన్నట్లుగా వుంది సునీల్ దేవధర్ వ్యాఖ్యల సారాంశం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సునీల్ దేవధర్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరమిక్కడ. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంటే, కేంద్రం ఏం చేస్తున్నట్లు.?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరుగుతుందన్నది ముందు ముందు తేలుతుంది. అరెస్టులు, జైళ్ళు.. ఇవి రాజకీయ నాయకులకు కొత్త కాదు. కానీ, ఇలాంటి సందర్భాల్లో బీజేపీ తన అసలు రంగు బయటపెట్టేసుకుంటోంది.!