కృష్ణాజిల్లాలోని కీలకమైన స్థానాల్లో మైలవరం అసెంబ్లీ స్థానం కూడా ఒకటి. ఇక్కడ నుంచి 2009, 2014లలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన ఉమ… టీడీపీలో ముఖ్య నేతగా ఎదగడంతోపాటు.. కృష్ణాజిల్లా టీడీపీలో ధీటైన నాయకుడిగా ఉన్నారు. దానికి కారణం… దేవినేని ఫ్యామిలీకి టీడీపీకి దశాబ్దాల బంధం ఉండటమే. అలాంటి ఉమకు ఇప్పుడు ఎదురు మొదలైంది!
అవును… 2024లో మైలవరం నుంచి పోటీకి రెడీ అవుతున్న దేవినేని ఉమాకు గతంలో ఉన్నంతగా ఇప్పుడంత సానుకూలత కనిపించడంలేదని అంటున్నారు. అలా అని ప్రత్యర్థుల నుంచి కాదు సుమా… సొంత పార్టీలోనే ప్రత్యర్ధులు తయారయ్యారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేనిని ఇప్పటికే రెండు సార్లు గెలిపించామని.. ఇక ఆయనను మోయలేమని మొఖం మీదే చెప్పేస్తున్నారు.
ఈ సందర్భంగా… కృష్ణాజిల్లా టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ బొమ్మసాని సుబ్బారావు.. దేవినేని పై డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. రెండు సార్లు దేవినేని ఉమాను గెలిపించడంలో తనది పెద్ద పాలేరు పాత్ర అని… కాకపోతే ఈసారి మాత్రం అది అస్సలు కుదరదని తేల్చి చెప్పేస్తున్నారు బొమ్మసాని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా… ఈసారి దేవినేని ఉమాకు టికెట్ ఇస్తే సొంత వారు సైతం సహకరించరని బాంబు పేల్చారు.
దీంతో… ఇప్పుడు ఈ మైలవరం నియోజకవర్గం బాబుకు పెద్ద తలనొప్పిగా మారబోతుంది. కాగా… నందిగామ నుంచి 1999, 2004లలో వరసగా గెలిచిన దేవినేని ఉమా.. నందిగామ ఎస్సీ రిజర్వుడు కావడంతో మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ కూడా 2009, 2014లో రెండు సార్లు గెలిచారు. అయితే 2019లో వసంత క్రిష్ణ ప్రసాద్ చేతిలో ఓటమి పాలు అయ్యారు.