అసలు సలహాదారు అనే పదవి ఎందుకు.? అన్న ప్రశ్న గతంలోనే తెరపైకొచ్చింది. చంద్రబాబు హయాంలో సలహాదారులుగా కొందరు పని చేశారు. అప్పట్లో వారికి చంద్రబాబు సర్కారు ‘దోచి పెట్టింది’ అనే విమర్శలు వైసీపీ నుంచి ఘనంగా వినిపించాయి. రాజధాని విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. ఈ సలహాదారులు చేసిన యాగీ అంతా ఇంతా కాదు.
ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనూ సలహాదారులున్నారు. ఆయా సలహాదారుల్లో ప్రధానంగా కనిపిస్తున్నది సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. ఆయనకి ‘డిఫాక్టో సీఎం’ అనీ, ‘సకల శాఖల మంత్రి’ అనీ గుర్తింపులున్నాయి. మిగతా సలహాదారుల్లో ఎవరూ పెద్దగా మీడియా ముందుకు రారు. సలహాదారులంటేనే ఖర్చు దండగ వ్యవహారం. ఇందులో అనుమానమేముంది.? ప్రభుత్వ ఖజానా నుంచి వారికి చెల్లింపులు జరుగుతాయి. వారిచ్చే సలహాల వల్ల రాష్ట్రానికి అదనపు ప్రయోజంన ఏమైనా వుంటుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
వైసీపీ కోసం పని చేసిన చాలామందికి ప్రభుత్వంలో అవకాశాలు కల్పించేందుకోసం ఈ సలహాదారు పదవులూ ఉపయోగపడుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల్లాంటివే ఈ సలహాదారు పదవులు కూడా. ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్లు దాఖలవడంతో, సలహాదారులనే పదవులకు సంబంధించిన చట్ట బద్ధతను తేల్చుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
దాంతో, డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. క్యాబినెట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందట. విధి విధానాలూ దాదాపు ఖరారయ్యాయట. మంచి నిర్ణయమే ఇది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులుంటే తప్పు లేదు. కానీ, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనీ.. ఇంకోటనీ ఎడా పెడా సలహాదారులు పుట్టుకొచ్చేస్తే.. ఖజానాపై భారమే.!