ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తెరవెనుక మంతనాలు, స్నేహాలు.. ఇంకో వైపేమో, ఆ పార్టీ మీద తీవ్రస్థాయి విమర్శలు. ఇదెక్కడి రాజకీయం.? అంటూ భారతీయ జనతా పార్టీ తీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంబంధాలున్నాయి. అంతే కాదు, ఢిల్లీ స్థాయి బీజేపీ పెద్దలకీ, వైసీపీ ముఖ్య నేతలకీ మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. కానీ, ఏపీ బీజేపీ నేతల్లో కొందరు మాత్రం, వైసీపీ పట్ల అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా ఒకింత అసంతృప్తితో వుంది. బీజేపీ వ్యవహరిస్తున్న రెండు నాల్కల వైఖరి ప్రజలందరికీ అర్థమవుతోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలువుతున్న తీరు పట్ల కేంద్రం ప్రశంసలు గుప్పిస్తోంటే, ఏపీ బీజేపీ నేతలు దాన్ని జీర్ణంచుకోలేకపోతుండడం శోచనీయమే.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరాల్సిందిగా వైసీపీకి చాన్నాళ్ళుగా ఆఫర్స్ వస్తున్న మాట వాస్తవం. దీనిపై చాలా కథనాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి మీడియాలో. ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డంగా పెట్టి, వైసీపీ.. బీజేపీని ఇరకాటంలో పడేసింది. ప్రత్యేక హోదా ఇస్తే, బీజేపీతో కలవడానికి వైసీపీకి అభ్యంతరం వుండకపోవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీతో వైసీపీ ఎలా కలుస్తుంది.? ఈ విషయమై వైసీపీని ఒప్పించడానికి బీజేపీ పెద్దలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా మీడియాలో వచ్చిన ఓ కథనం ఏపీ బీజేపీ నేతలకు కాస్త ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో, ‘రౌడీ పార్టీ’ అంటూ వైసీపీ మీద విరుచుకుపడిపోయారు బీజేపీ నేతలు. వైసీపీ విషయంలో ముందుగా బీజేపీ అధిష్టాన వైఖరేంటో తెలుసుకుని, ఆ తర్వాత ఏపీ బీజేపీ నేతలు అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే బావుంటుందేమో. లేకపోతే, ప్రతిసారీ బీజేపీ ఏపీ ప్రజల దృష్టిలో పలచనవుతూనే వుంటుంది.