జనసేనలోకి బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ.?

‘రాష్ట్రంలో బలపడే అవకాశాలున్నా, సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం..’ అంటూ బీజేపీలో కొంత నిరసన గళం వినిపిస్తున్నారు ఏపీ బీజేపీ మాజీ చీఫ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ. 2014 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి దూకెయ్యాలనుకున్నారుగానీ, అనూహ్యంగా ఆయన బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ చీఫ్ అయ్యారు కూడా.

కానీ, బీజేపీలో ఇమడలేకపోతున్నారు కన్నా లక్ష్మినారాయణ. ఏపీ బీజేపీ ప్రస్తుత చీఫ్ సోము వీర్రాజుతో కన్నా లక్ష్మినారాయణకు అస్సలు పొసగడంలేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుని వేరే పార్టీల్లో వెతుక్కునేందుకు సమాయత్తమయ్యారు. వైసీపీలోకి ఆయనకు ఎంట్రీ లేదు. టీడీపీ పట్ల కన్నా ఎందుకో ఆసక్తితో లేదరు.

అందుకే, జనసేన వైపుగా కన్నా లక్ష్మినారాయణ ఆలోచనలు సాగుతున్నాయట. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌తో కన్నా లక్ష్మినారాయణ ‘ఏకాంతం’గా భేటీ అవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి, పలువురు బీజేపీ నేతల్ని వెంటేసుకుని, పలువురు జనసేన నేతల సమక్షంలో కన్నా లక్ష్మినారాయణ, నాదెండ్ల మనోహర్‌తో సమావేశమయ్యారు. ఇందులో ఏకాంతమేమీ లేదు.

కన్నా లక్ష్మినారాయణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్ద తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. తద్వారా బీజేపీలో కొంత అలజడికీ ఆయన కారణమయ్యారు. ఈ భేటీపై సమాచారం ఇవ్వాలంటూ జనసేన పార్టీని కోరారట బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఏపీలో బీజేపీకి భవిష్యత్తు లేదు. వుందనే భ్రమల్లో ఇంకా బీజేపీ నేతలు కొట్టుమిట్టాడటం ఆశ్చర్యకరమే.