బీజేపీ ‘పొత్తు’ షరతుకి చంద్రబాబు ఒప్పుకుంటారా.?

గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒకప్పుడు బీజేపీకి ఇచ్చే స్థితిలో చంద్రబాబు వున్నారు. ఇప్పుడు ఆ బీజేపీ నుంచి తీసుకోవాల్సిన స్థితిలోకి టీడీపీ అధినేత దిగజారాపోయారు.! ఇదీ రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్. నిజానికి, బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు తెచ్చుకోవడం కూడా ఏపీలో కష్టమే. అయినాగానీ, ఏపీ రాజకీయాల్ని బీజేపీ శాసిస్తోంది.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అంటున్నట్లు, ఏపీకి చెందిన ఎంపీలంతా బీజేపీ మనుషులే.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఔను మరి, బీజేపీని కాదనే పరిస్థితి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకీ (కాంగ్రెస్, వామపక్షాలు మినహా) లేకపోయింది.

అధికార వైసీపీ సంగతి పక్కన పెడితే, వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా మళ్ళీ బీజేపీతో జతకట్టేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుని ఎంటర్టైన్ చేయడానికి బీజేపీ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లే కనిపిస్తోంది.

కొన్నాళ్ళ క్రితం బీజేపీ మాట తీరుకీ, ఇప్పుడు బీజేపీ మాట తీరుకీ స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బీజేపీ మీద వైసీపీ నేతలు కొత్తగా విరుచుకుపడుతున్న తీరు చూస్తోంటే, టీడీపీకి దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందేమోనన్న అనుమానాలు కలగకమానదు.

అయితే, ముఖ్యమంత్రి పదవిపై పట్టుబట్టకూడదంటూ బీజేపీ, టీడీపీ ముందు ప్రతిపాదన వుంచిందట. పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి.. అని బీజేపీ చెబుతున్న విషయం విదితమే. అదే సమయంలో, ‘మా పార్టీలోనూ ముఖ్యమంత్రి అవ్వగల స్థాయి, అనుభవం వున్న వ్యక్తులు చాలామందే వున్నారు..’ అని బీజేపీ అంటోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ముందు పెట్టి, టీడీపీని దార్లోకి తెచ్చుకుంటోంది బీజేపీ. అయితే, చంద్రబాబు అందుకు ఒప్పుకుంటారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒప్పుకోక తప్పదు చంద్రబాబుకి ఈ విషయంలో.v