బిజెపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి నడవడానికి సిద్దపడిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని రైతుల కోసం భాజాపాతో కలిసి ముందుకెళుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల ఆధ్వర్యంలో అమరావతిలో ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ఢిల్లీ పర్యటన అనంతరం ఈ ప్రకటన చేసారు. అయితే ఈ లాంగ్ మార్చ్ వాయిదా వేసినట్లు భాజాపా రాష్ట్ర ఉఫాద్యక్షుడు నాగభూషణం ప్రకటించారు. త్వరలో కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో జనసేన పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. వాయిదాకి కారణం ఏమై ఉంటుంది? అంటూ జనసేన కార్యకర్తల్లోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో రకరకరాల కారణాలు వైరల్ అవుతున్నాయి.
ఉద్యమం కేవలం అమరావతి లోని కొన్ని గ్రామాలకే పరిమితం. మిగతా అన్ని జిల్లాలు అభివృద్ది వికేంద్రీకరణకే ఓటు వేసారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో వెనుకబడిన ఉత్తరాంధ్ర- రాయలసీమ జిల్లాలు అభివృద్ది చెందుతాయని హర్షాతిరేకాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల నుంచి జనసేనకు వ్యతిరేకంగా రోజు రోజుకి నినాదాలు మిన్నంటుతున్నాయి. అమరావతిలో పవన్ కళ్యాణ్ కు భూములున్నాయని, ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీపైనా అక్షింతలు పడుతున్నాయి.
అటు టీడీపీతోనూ భాజాపాకు సరైన సఖ్యత లేదు. ఇలాంటి సమయంలో జనసేనతో నడిస్తే పార్టీకి ఉన్న ప్రాబల్యం కూడా తగ్గుతుందని భాజాపా భావిస్తోందని వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు బీజీపీ యూటర్న్ తీసుకునేలా కనిపిస్తోందని కథనాలు వేడెక్కిస్తున్నాయి. జనసేనకు మద్దతిస్తే ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల్లో బీజేపీ పై ప్రభావం తప్పదని ఇప్పటికే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం అదేశించడంతోనే బీజేపీ లాంగ్ మార్చ్ ని స్కిప్ కొట్టడానికి ఈ ప్రకటన ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక రాజధాని తరలింపు వ్యవహారంలో కేంద్రం మాత్రం గుంభనగానే వ్యవహరిస్తోంది. కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోదని జీవీఎల్ లాంటి భాజపా పెద్దలు చెబుతున్నారు. మరి ఇలాంటప్పుడు పవన్ తో భాజపా చెలిమి వ్యవహారం ఎన్ని మలుపులు తిరగనుందో చూడాలి