ఈ నెలాఖరు నుండి ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించేందుకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంటోందనే ప్రచారం ఊపందుకుంది. ముందుగా తెలుగుదేశంపార్టీ నేతలపై ఆకర్ష్ వలను విసురుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలతో బిజేపి నేతలు చర్చలు కూడా పూర్తి చేశారట. విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జోరందుకోవటంతో చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది.
మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత చాలామంది మాజీ ప్రజాప్రతినిధులు పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల నేతల పేర్లే ఎక్కువగా వినిపిస్తోంది. అనంతపురం జిల్లా నుండి మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డి తదితరుల పేర్లు వినబడుతున్నాయి.
అలాగే కర్నూలు జిల్లా నుండి మాజీ ఎంఎల్ఏ మీనాక్షీ నాయుడు, వీరభద్రం గౌడ్, భూమా కుటుంబం తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాగే విజయవాడ ఎంపి కేశినేని నాని తో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా బిజెపిలో చేరపోనున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది.
జరుగుతున్న ప్రచారం ప్రకారమే నేతలు టిడిపిని వదిలేయటం ఖాయమైతే చంద్రబాబుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అవసరం లేకపోయినా పార్టీ ఫిరాయింపులను బాగా ప్రోత్సహించిన పాపానికి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సొస్తోంది.