టీడీపీతో మళ్ళీ జతకట్టేందుకు బీజేపీ సిద్ధమయ్యిందా.?

BJP

BJP : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి వుండగా, అంతకన్నా ముందే రాష్ట్రంలో ఎన్నికలు జరగొచ్చన్న ప్రచారం నేపథ్యంలో ‘పొత్తుల రాజకీయం’ వేడెక్కింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం, చిలికి చిలికి గాలి వానంగా మారింది.

టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని గతంలో చెప్పిన బీజేపీ, ఇప్పుడు మెత్తబడుతోంది. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు సమర్థిస్తే, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదంటూ గతంలో మెలిక పెట్టిన బీజేపీ, ఇప్పుడు స్వరం కాస్త మార్చేలా కనిపిస్తోంది.

మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, వీలైనంత త్వరగా పొత్తుల వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ బీజేపీ బృందం, తమ అధిష్టానాన్ని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేనతో ఎలాగూ బంధం కొనసాగుతోందనీ, అది మరింత బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ అధిస్టానాన్ని కోరారట. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా.? వద్దా.? అన్నదానిపైనా నిర్ణయం తీసుకోవాలన్నది ఏపీ బీజేపీ, అధిష్టానాన్ని కోరిన విషయాల్లో కీలకమైన పాయింట్ అని అంటున్నారు.

‘రాష్ట్రంలో వైసీపీ సర్కారుని దించే శక్తి టీడీపీకి మాత్రమే వుంది..’ అని పదే పదే చంద్రబాబు చెబుతున్నారు. అయితే, అసలంటూ టీడీపీకి ఇప్పుడు నిఖార్సుగా వున్న బలమెంత.? అన్నదానిపై చంద్రబాబుకీ సందేహాలున్నాయి. అయితే, ఆయన మీడియాని మేనేజ్ చేయగలరు. ఆ మీడియా ద్వారా ప్రజల ఆలోచనల్లో మార్పు తేగలరని బీజేపీ నమ్ముతోందిట. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.

త్వరలో బీజేపీ అగ్రనాయకత్వం ఏపీలో పర్యటించనున్న దరిమిలా, అప్పుడే చంద్రబాబుతో పొత్తు విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశముందని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.