బద్వేలులో బీజేపీ పరాజయాన్ని చవిచూసింది. హుజూరాబాద్‌లో విజయాన్ని అందుకుంది. ఏంటి తేడా.? తెలంగాణలో బీజేపీ ఎందుకు తన ఉనికిని చాటుకుంటోంది.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు తడబడుతోంది.? నిజానికి, తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య మైత్రి సరిగ్గా లేదు. బద్వేలులో మిత్రపక్షం జనసేన, బీజేపీకి పూర్తిగా సహకరించింది.
పైగా, బద్వేలులో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీలో కూడా లేదు. దాంతో, అక్కడ మెరుగైన ఫలితాన్ని బీజేపీ సాధించి వుండాలి. కానీ, బద్వేలులో బీజేపీ చతికిలపడింది. కారణమేంటి.? బీజేపీలో జరుగుతున్న అంతర్మధనమిది.
నిజానికి, తెలంగాణలో బీజేపీ వున్నంత యాక్టివ్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించడంలేదు. పైగా, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చాలా విషయాల్లో బీజేపీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. అదే అతి పెద్ద సమస్య. ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, రాజధాని విషయంలో కావొచ్చు, ఇంకో విషయంలో కావొచ్చు.. ఏపీ బీజేపీ అస్సలు సమర్థవంతంగా పని చేయడంలేదు.
తెలంగాణలో అలా కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో అయినా, తెలంగాణ ప్రజలకు చేరువవడంలో అయినా, బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పైగా, తెలంగాణలో బీజేపీకి ప్రజా ప్రతినిథులున్నారు.. వాళ్ళంతా చాలా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు.
బీజేపీ తాను మునగడంతోపాటు పనిలో పనిగా మిత్రపక్షం జనసేనను కూడా ఆంధ్రప్రదేశ్‌లో ముంచేస్తోంది. ఇదే జోరు బీజేపీ కొనసాగిస్తే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పూర్తిగా గల్లంతయిపోవచ్చు. బీజేపీ సంగతి ఆ తర్వాత మాట్లాడుకోవడానికే వుండదేమో. తెలంగాణ బీజేపీని చూసి అయినా, ఏపీ బీజేపీ కాస్తంత పనికొచ్చే రాజకీయం చేస్తే మంచిది.