ప్రజాస్వామ్యం వస్త్రాపహరణకు గురవుతోందనే అర్థం వచ్చేలా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ కార్టూన్.. తెలంగాణలో నిప్పు రాజేసింది. ద్రౌపదీ వస్త్రాపహరణానికి సంబంధించిన కార్టూన్ అది. ఎన్నికల ప్రధాన కమిషనర్ కార్యాలయం సహా సహా రిటర్నింగ్ అధికారులు అందరూ కలిసి ద్రౌపది వస్త్రాలను అపహరిస్తున్నారంటూ ఇందులో పొందుపరిచారు.
ద్రౌపది వస్త్రాపహరణ దృశ్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విలాసంగా చూస్తూ ఉన్నట్లు ఇందులో చిత్రీకరించారు. `డెమోక్రసీ ఇన్ తెలంగాణ` అని దీనికి టైటిల్ కూడా పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని ద్రౌపదిగా, చీరను ఓటర్లుగా చూపించారు. ఈ కార్టూన్‌పై టీఆర్ఎస్, మజ్లిస్ మండిపడుతున్నాయి. బీజేపీ కూడా వారితో గళం కలిపింది.
ఈ కార్టూన్‌పై కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మహిళలను కించపరిచేలా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూపొందించిన ఈ కార్టూన్‌ను ప్రియాంకా గాంధీ అనుమతి తీసుకునే చిత్రీకరించారా? అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది.
మహిళలే తమ సగం బలం అని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ.. చివరికి వారినే కించపరిచేలా ఇలా చిత్రీకరిస్తుందని తాను ఊహించలేదని ఒవైసీ చెబుతున్నారు. ఈ కార్టూన్‌ను తెలంగాణ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిస్థితి ఎంతటి దుస్థితిలో ఉందో తెలియజెప్పడానికే ఈ కార్టూన్‌ను రూపొందించామని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో ఎన్నికల కమిషన్ దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడంలో ఎన్నికల కమిషన్ వైఫల్యాలను ఎత్తి చూపడమే ఆ కార్టూన్ ఉద్దేశమని చెప్పారు. తాము ఎక్కడా హిందువుల మనోభావాలను కించపరచ లేదని, ఓ హిందువుగా తానీ మాటను చెప్పగలుగుతున్నానని అన్నారు.