ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాసేపు చంద్రబాబుని, జగన్ ని, పవన్ కళ్యాణ్ ని తిడుతారు. మళ్ళీ అదే నోటితోనే వారిని పొగుడుతారు. ఇలా ఊసరవెల్లి ప్రవర్తనతో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటుకుంటారు. అందుకే రాజకీయాల్లో ఈయన్ని అపరిచితుడు అని పిలుచుకుంటారు. అలాగే అసెంబ్లీలో నవ్వులు కురిపిస్తూ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు విష్ణు కుమార్ రాజు.
అసెంబ్లీలో మాట్లాడుతూ విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను ఏ పార్టీలో ఉన్నా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అన్నారు. నేను ఈరోజు బీజేపీలో ఉన్నాను, రేపు ఉంటానో లేదో తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏపీకి బీజేపీ ఇచ్చిన నిధులపై అసెంబ్లీలో వివరిస్తుండగా టీడీపీ నేతలు కల్పించుకుని నిజాలు మాట్లాడాలని సూచించారు. దీనిపై స్పందించిన విష్ణు కుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
నేను ఏ పార్టీలో ఉన్నా అవాస్తవాలు మాట్లాడని, ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాట్లాడటం నా నైజం అని వెల్లడించారు. గుజరాత్ లో పటేల్ విగ్రహానికి కేంద్రం 300 కోట్ల రూపాయలు ఇస్తే 2,500 కోట్లు ఇచ్చారంటూ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. అమరావతి కోసం కేంద్రం నిధులు ఇవ్వడం అవసరం అని, అందుకోసం నేను కూడా పోరాడతానని చెప్పారు.
అయితే విష్ణు కుమార్ రాజు వైసీపీలో చేరనున్నట్టు ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. జగన్ కి ఈయన రహస్య మిత్రుడు అని ఏపీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో విష్ణు కుమార్ రాజు రేపు బీజేపీలో ఉంటానో లేదో అనటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.