ఏపీలో పొత్తులపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు!

గతకొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ఏపీలో బీజేపీ అగ్రనేతలు సభలు పెట్టడం, ఆ సభల్లో మైకులందుకుని జగన్ సర్కార్ పై దుమ్మెత్తి పోయడం తెలిసిందే. దీంతో పల్నాడు సభలో రాబోయే ఎన్నికల్లో తనకు బీజేపీ సపోర్ట్ కూడా ఉండదని జగన్ స్పష్టం చేసేశారు. ఈ క్రమంలో పొత్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ కీలక నేత పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 2014 తరహాలోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన బలంగా కోరుకుంటుండగా.. టీడీపీ కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తుందనేది సుస్పష్టం! సరిగ్గా ఇదే సమయంలో కేంద్రంలో మోడీకి జగన్ కి లోపాయకారీ ఒప్పందాలు ఉన్నట్లుగా వస్తున్న కథనాలకు చెక్ పడింది.

దీంతో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పొడవడం ఖాయంగా అనే కథనాలు మొదలైపోయాయి. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ అగ్రనేత అమిత్ షా ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడటంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా ఈ విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్!

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలతోపాటు బీజేపీ ఎత్తుగడల్లో కూడా కనిపిస్తున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో దుష్యంత్ కుమార్ గౌతమ్ ఇవాళ ఏపీలో పొత్తులపై స్పందించారు. ఇందులో భాగంగా… ఏపీలో పొత్తుల విషయంలో కేంద్ర కమిటీ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో పొత్తులపై ఎన్నికల సమయానికి అంతిమ నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఇదే సమయంలో హస్తిన లో జరిగిన అమిత్ షా – చంద్రబాబు భేటీపై స్పందించేందుకు మాత్రం దుష్యంత్ కుమార్ నిరాకరించారు. ఆ వ్యవహారంపై ఇప్పుడే మాట్లాడలేమని తేల్చి చెప్పారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తును ఆయన ఖండించలేదు.

కాగా, బీజేపీతో పొత్తును టీడీపీలోని కొంతమంది నేతలు స్వాగతిస్తుండగా.. మరికొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు! ఇప్పటికే జనసేనతో పొత్తు ఫలితంగా తక్కువలో తక్కువ పాతిక ముప్పై సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో… ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు అంటే.. మరో 15 – 20 సీట్లు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి దాపురిస్తాదని వారు ఫైరవుతున్నారు.