పొత్తులపై విష్ణు కుమార్ షాకింగ్ స్టేట్ మెంట్!

ఏపీలో ఇప్పుడు ఏ పార్టీతో మరేపార్టీకి పొత్తు ఉందనే విషయం సామాన్య ప్రజానికానికీ, కార్యకర్తలకూ, నేతలకే కాదు.. అధినేతలకు కూడా స్పష్టంగా తెలియదు! అవును… జనసేన ఏపార్టీతో పొత్తులో ఉంది అంటే… జనసేన నేతలు ఏమని సమాధానం చెబుతారు? పోనీ జనసేనతో బీజేపీ పొత్తులో ఉందా అంటే… బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారు? ఆ సంగతులు చూసేముందు… బీజేపీ – టీడీపీ – జనసేన మాత్రం కలిసిపోవాలని, కలిసి పోటీచేయాలని కోరుకుంటూ మనసులోమాట ఓపెన్ గా చెప్పేశారు ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు!

అవును… ఏపీలో పొత్తులపై ముసుగులో గుద్దులాటల కబుర్లు నడుస్తున్న తరుణంలో… తనమనసులో మాటను ఓపెన్ గా చెప్పేశారు విష్ణుకుమార్ రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే.. ఏపీలో వైసీపీని గద్దె దించేందుకు “టీడీపీ – బీజేపీ – జనసేన” కలసి పోటీ చేయాలని జనాలు అనుకుంటున్నారని అంటున్నారు. సరే జనాల భుజాపై పెట్టి పేల్చినా… చెప్పాలనుకున్న విషయం ఏదోలా చెప్పారు. దీంతో… సోము వీర్రాజు & కో లు విష్ణుపై కళ్లు ఎర్రగా చేసి చూస్తున్నారంట!

ఎందుకంటే… పొత్తులో ఉన్నాము అనే ముసుగులో, ఏపీ బీజేపీకి జనసేన అధినేత పవన్ చేసిన ద్రోహాలు, పొడిచిన వెన్నుపోట్లూ అన్నీ ఇన్నీ కాదు. బీజేపీతో పొత్తులో ఉన్నామని పైకి చెబుతూ… బాబు డైరెక్షన్ లో నడుస్తూ… గడిచిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి కనీసం మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు పవన్. ఈ విషయంలోనే హర్ట్ అయిన మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఆ మధ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సోము వీర్రాజైతే ఫుల్ క్లారిటీతో ఉన్నట్లున్నారు. జనసేన బీజేపీల మధ్య పొత్తు తప్ప మూడో పార్టీకి చాన్సే లేదని అంటున్నారు. అలాకానిపక్షంలో అవసరమైతే ఒంటరిగా అయినా వెళ్తాం కానీ… టీడీపీని కలుపుకుపోయే ప్రసక్తి లేదని చెబుతున్నారు.

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము మాట అలా ఉంటే… బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదవ్ మాట ఇలా ఉంటే… విష్ణుకుమార్ మాత్రం… కలవాల్సిందే అని చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే… జనసేనతో పొత్తు వల్ల ఏపీ బీజేపీకి ఎంతవరకూ లాభమో తెలియదు కానీ… బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు మాత్రం హెల్ప్ అయ్యేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు.

ఇక చంద్రబాబు మనసు మాత్రం… జనసేన – బీజేపీలను కలుపుకుపోవాలనే ఉందని అంటున్నారు! అలాకానిపక్షంలో… పోరాటం కష్టమని, ఈసారి తేడా వస్తే ఇక రాజకీయ విశ్రాంతే అని భావిస్తున్న బాబు… ఈ మేరకు పవన్ తో హస్తిన కేంద్రంగా రాయబారాలు పంపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ రాయబారాలు వర్క్ అవుట్ అవ్వటం లేదని తెలుస్తుంది! మరి చూడాలి… ఎన్నికలు సమీపించేనాటికి ఏపీలో ఎవరెవరి మధ్య పొత్తులు పొడుస్తాయనేది!