తానా సభల్లో పెద్ద షాక్

అమెరికాలోని తెలుగు వాళ్ళ సభలైన  ’తానా’ లో రామ్ మాధవ్ కు పెద్ద షాక్ తగిలింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి రామ్ మాధవ్ కు అమెరికాలో పెద్ద అవమానం జరిగింది. ’తానా’ సభల్లో పాల్గొనేందుకు నిర్వాహకులు రామ్ మాధవ్ ను ఆహ్వానించారు. సభలో మాట్లాడే సమయంలో సభల్లో పాల్గొన్న వాళ్ళు పదే పదే అడ్డుతగలటంతో చేసేది లేక వేదిక నుండి దిగిపోవాల్సొచ్చింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమిని ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. సమీప భవిష్యత్తులో టిడిపి కోలుకుంటుందన్న నమ్మకం లేకపోవటంతో పాటు చంద్రబాబు నాయకత్వం మీద నేతల్లో భ్రమలు తొలగిపోతున్నాయి. దాంతో ఎవరికి వాళ్ళుగా ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగానే టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ ఎంపిల్లో నలుగురు బిజెపిలోకి ఫిరాయించారు. ఈ ఫిరాయింపులో రామ్ మాధవే కీలక పాత్ర. బిజెపిలోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్న చాలామంది టిడిపి నేతలు రామ్ తోనే టచ్ లో ఉన్నారు. ఇక్కడే అమెరికాలోని కమ్మ సామాజికవర్గానికి మండుతోంది. అమెరికా ప్రత్యేకించి తానాలో ఉండే కమ్మ సామాజికవర్గంలో అత్యధికులు చంద్రబాబుకు వీరాభిమానులన్న విషయం తెలిసిందే.

అటువంటి సభల్లో చంద్రబాబును కించపరుస్తు మాట్లాడటమే కాకుండా నరేంద్రమోడిని ఆకాశానికి ఎత్తేస్తు రామ్ మాట్లడటాన్ని తట్టుకోలేకపోయారు. దాంతో మాధవ్ ప్రసంగానికి పదే పదే అడ్డుపడ్డారు. నిర్వాహకులు ఎంత చెప్పినా ఎవరూ లెక్కచేయలేదు. దాంతో చేసేది లేక ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి రామ్ దిగిపోయారు. రామ్ మాధవ్ ను పిలిస్తే అవమానం జరుగుతుందన్న చిన్న విషయాన్ని కూడా నిర్వాహకులు ఆలోచించలేదంటే ఆశ్చర్యంగా ఉంది.