ఆంధ్రాకి కొత్త గేలం వేస్తున్న బీజేపీ

BJP

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో బీజేపీ మీద వ్యతిరేకత నెలకొంది. దీంతో మళ్ళీ అభివృద్ధి పేరుతో మరోసారి కేంద్రమంత్రి ద్వారా ఏపీ ప్రజలకు గేలం వెయ్యాలని చూస్తుంది బీజేపీ. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని ప్రారంభించిన కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఏపీలో కేంద్ర విద్యాసంస్థల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ, విద్యాసంస్థల నుండి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేంద్ర నిధులతోనే నిర్మిస్తామని తెలిపారు. దేశంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలకు సమానంగా ఆంధ్రాలోని సెంట్రల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తొలి విడతలో 460 కోట్ల రూపాయలు యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం విడుదల చేశామని, రెండవ విడతలో 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు జవదేకర్.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పిన మోడీ నాలుగేళ్లయినా హోదా కల్పించలేదు. ఇప్పుడు కేంద్రమంత్రి జవదేకర్ ఆంధ్రా అభివృద్ధి విషయంలో టీమిండియాలా పని చేస్తామని, రాజకీయం చేయమని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు అంటున్నారు ప్రజలు. బీజేపీ సర్కారుకి ఏపీపై ప్రత్యేక దృష్టి ఉందని అందుకే ఇక్కడ విద్యారంగంలో అన్నిరాష్ట్రాలకంటే పురోగతి సాధించిందని జవదేకర్ తెలిపారు. త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. దాన్ని కూడా ఆయనే వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు. ఈ విధంగా విశ్వవిద్యాలయాలను ఎరగా వేసి యువతను ఆకట్టుకోవాలని చూస్తోంది బీజేపీ. ఎన్నికలు దగ్గరకి వస్తున్నాయి కదా ఆంధ్రాను అభివృద్ధి చేస్తామంటూ మోసపూరిత హామీలు ఇచ్చి మరోసారి ప్రజల్ని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నట్టుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక దృష్టి ఉన్నవారికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకో మరి. బహుశా ప్రత్యేక దృష్టి అంటే మెల్లకన్నుతో చూస్తున్నారేమో!! అందుకే ఏపీలో ఉన్న సమస్యలు కనిపించట్లేదేమో మోడీ సర్కారుకి అని విమర్శిస్తున్నారు పలువురు రాజకీయ విమర్శకులు.