జగన్ పై డోసు పెంచుతున్న బిజెపి

మెల్లిగా జగన్మోహన్ రెడ్డిపై బిజెపి విమర్శలు, ఆరోపణల డోసు పెంచుతోంది. మొన్నటి వరకూ జగన్ పై ఏమీ మాట్లడని బిజెపి నేతలు క్రమంగా ఒక్కొక్కళ్ళు గొంతులు విప్పుతున్నారు. తాజాగా  మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శలు, ఆరోపణలు చూస్తుంటే జాతీయ పార్టీ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే గొంతులు సవరించుకుంటున్నట్లు అర్ధమవుతోంది.

ప్రత్యేకహోదా విషయంపై మాట్లాడుతూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నట్లు మండిపడ్డారు. ఏపికి ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసినా జగన్ మాత్రం ఇంకా హోదా సాధిస్తామనే చెప్పటమంటే జనాలను మోసం చేయటమేనంటూ ఆరోపించారు.

అదే సమయంలో తొందరలో ప్రారంభమయ్యే గ్రామసచివాలయాలపైన కూడా విమర్శలు చేశారు. ఎటువంటి వ్యవస్ధలు తీసుకువచ్చినా రేషన్ డీలర్లు, ఫీల్డు అసిస్టెంట్లకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలట. ఇసుకపై నిషేధం విధించటంతో జనాలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపోయారు.

ఇక రెండు రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు తేడా లేదని ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. జనాలను మోసం చేయటంలో చంద్రబాబు బాటలోనే జగన్ కూడా నడుస్తున్నట్లు కన్నా అన్నారు. అంటే వీళ్ళు మెల్లిగా జగన్ పైన కూడా యుద్ధం ప్రకటిస్తున్నారే అనుకోవాలి.